అన్న‌ద‌మ్ముల అనుబంధం అదిరిపోయిందిగా!!

May 28, 2020

సెంటిమెంట్ల‌కు కాలం చెల్లిన రోజులుగా చెబుతుంటారు. త‌ల్లిదండ్రుల్ని వారి బిడ్డ‌లు.. భార్య‌ను భ‌ర్త‌.. భ‌ర్త‌ను భార్య‌.. అన్న‌ను త‌మ్ముడు.. ఇలా చెప్పుకుంటే సొంత కుటుంబ స‌భ్యుల్ని డ‌బ్బు కోసం..వారి ఆస్తిపాస్తుల కోసం చంపేసే దారుణ ఘ‌ట‌న‌ల్ని ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ చూస్తున్నాం. కానీ.. అందుకు భిన్నంగా అస‌లుసిస‌లు అన్న‌ద‌మ్ముల అనుబంధానికి నిద‌ర్శ‌నంగా చోటు చేసుకున్న వైనం భార‌త కార్పొరేట్ రంగంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్పాలి.
భార‌త అప‌ర కుబేరుడు.. ప్ర‌పంచ సంప‌న్నుల్లోనూ టాప్ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. త‌న త‌మ్ముడు.. కొన్నేళ్ల క్రితం ఆస్తి త‌గాదాల్లో విడిపోయిన సోద‌రుడి కోసంఆయ‌న చేసిన తాజా సాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన త‌మ్ముడు అనిల్ అంబానీ కోసం అన్న ముకేశ్ అంబానీ ఏకంగా రూ.458 కోట్లను ఒక్క‌రోజులో చెల్లించిన వైనం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.
ఏ ఆస్తుల కోసం కుటుంబాలు కొట్టుకు చ‌స్తుంటే.. అందుకు భిన్నంగా త‌మ్ముడు .జైలుపాలు కాకుండా చేసేందుకు వంద‌ల కోట్ల మొత్తాన్ని ఒక్క‌రోజులో చెల్లించి కోర్టు తిప్ప‌ల నుంచి త‌మ్ముడ్ని ర‌క్షించిన అన్న‌గా ముకేశ్ నిలిచారు. ఎరిక్స‌న్ కు అనిల్ అంబానీ చెల్లించాల్సిన బ‌కాయిల్ని గ‌డువుకు ఒక రోజు ముందు తీర్చేయ‌టం ద్వారా అనిల్ కు అన్న ముకేష్ అభ‌య‌హ‌స్తం ఉంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.
దీని ద్వారా అంబానీల కుటుంబంలో గొడ‌వ‌లుఎన్ని ఉన్నా.. స‌మ‌స్య ఎదురైతే మాత్రం అంతా ఒక్క‌టి కావ‌ట‌మే కాదు.. ఒక‌రినొక‌రు ఆదుకోవ‌టంలో ముందుంటార‌న్న మాట నిజ‌మైంద‌ని చెబుతున్నారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్య‌క్తి అప్పు చెల్లించ‌ని కార‌ణంగా జైలుకు వెళ్లాల్సి వ‌స్తే అన్న ముకేష్ అంబానీ చూస్తూ ఊరుకుంటారా? అన్నట్లే.. తాజాగా రియాక్ట్ అయిన అన్న త‌మ్ముడి కోసం ఏకంగా రూ.458 కోట్లు చెల్లించ‌టం మాత్రం గ్రేట్ మెచ్చుకోళ్లు మాత్ర‌మే కాదు.. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఉండాల్సిన అనుబంధానికి నిద‌ర్శ‌నంగా తాజా ఉదంతం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.