థియేటర్ల సంచలన నిర్ణయం !

August 07, 2020

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ నుంచి విముక్తి దొరుకుతుంది అని సాధారణ పౌరులు, వ్యాపారులు భావిస్తున్నారు గాని మాల్స్, సినిమా థియేటర్ల వారు భావించడం లేదు. ఎందుకంటే అవి వైరస్ వేగంగా వ్యాపించడానికి అవకాశాలు అన్నిరకాలుగా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అందుకనే చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని అనుభవిస్తున్నారు సినిమా థియేటర్ల యజమానులు. 

లాక్ డౌన్ నుంచి థియేటర్స్, మాల్స్ కు ఏప్రిల్ 30 తర్వాత గానీ విముక్తి లభించకపోవచ్చు. కానీ అప్పుడు కూడా స్వీయ ఆంక్షలు తప్పవనే విషయం యాజమాన్యాలకు అర్థమవుతోంది. మే, జూన్ నెల మొత్తం... 50-60 శాతం ఆక్యుపెన్సీ తోనే నడపాల్సి రావచ్చు. బుకింగ్ బుకింగ్ కి మధ్య ఒక సీటును ఖాళీ ఉంచకతప్పదు. దీనికి పీవీఆర్ యాజమాన్యం ఇప్పటికే ప్రిపేరైపోయింది. అంటే ఒక కుటుంబంలో ముగ్గురు సినిమాకు వస్తే...వారికి అటు ఇటుగా ఒక సీటు ఖాళీగా వదలుతారు. ఆ తర్వాత ఒక వ్యక్తి లేదా ఒక ఫ్యామిలీ బుక్ చేసుకుంటే మళ్లీ ఆ తర్వాత సీటు ఖాళీగా వదులుతారు. కరోనా వైరస్ చాలా సులువుగా సోకే అవకాశం ఉన్న వ్యాధి కాబట్టి వీలైనంత వరకు ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోకతప్పదు. అంటే థియేటర్లో 60 శాతం సీట్లకు మించి టిక్కెట్లు అమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు.

విషాదం ఏంటంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో సినిమా థియేటర్లకు వ్యాపారం దాదాపు శూన్యం. ఏప్రిల్ - జూన్ మధ్య సమ్మర్ సినిమాలకు పండగ కాలం. సమ్మర్ లాభాలతో ఆ ఏడాదిలో వచ్చే నష్టాలన్నీ భర్తీ అవుతుంటాయి. కానీ అంత విలువైన సమ్మర్ ఈసారి వృథా అయిపోయినట్టే. 

ఇక శానిటైజేషన్ ఖర్చు కూడా థియేటర్ల మీద భారీగా పడనుంది. ఒకవైపు లాభాలు లేకపోగా ఖర్చులు పెరగడం అనేది విచిత్రమైన విషయం. 1997లో ప్రారంభమైన పీవీఆర్ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ.. రెండు దశాబ్దాల్లో మేము ఇంత ఘోరమైన సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు అని వ్యాఖ్యానించింది. ఇక ప్రభుత్వ ఆంక్షలు ఒకెత్తు అయితే... జనం కూడా ఈ సమ్మర్ లో థియేటర్ కి రావడానికి ఆసక్తి చూపించరు. అంటే ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.