బెజవాడ బస్టాండ్లో ఆ వినోదం మిస్

August 14, 2020

తెలుగు రాష్ట్రాల్లో మరే పట్టణానికి లేని ప్రత్యేకత బెజవాడ బస్టాండ్ సొంతం. హైదరాబాద్ మహానగరంలో కూడా లేనంత పెద్ద బస్టాండ్ విజయవాడలోనే ఉంది. ఆసియాలోనే రెండో అతి పెద్ద బస్టాండ్ గా పేరున్న బెజవాడ బస్టాండ్ లో కొంతకాలం క్రితం సరికొత్త వినోదానికి తెర తీశారు.
బెజవాడ బస్టాండ్ లో వై స్క్రీన్స్ పేరుతో సినిమా థియేటర్లను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ థియేటర్లకు ఆదరణ భారీగానే ఉన్నప్పటికీ...సదరు సంస్థ ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించలేదు. దీంతో.. తాజాగా ఆ థియేటర్లను సీజ్ చేస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ అధికారుల లెక్కల ప్రకారం వై స్క్రీన్స్ గడిచిన ఆర్నెల్లుగా అద్దెలు చెల్లించటం లేదని చెబుతున్నారు.

నెలకు రూ.8లక్షలు చొప్పున అద్దె చెల్లించాల్సి ఉందని.. గతంలో కొంత బకాయిలు ఉన్నాయని.. వీటికి వడ్డీ కలిపితే మొత్తంగా రూ.94 లక్షల మేర ఆర్టీసీకి వై స్క్రీన్స్ సంస్థ బకాయి పడిందని.. ఈ క్రమంలో ఆ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బస్టాండ్ కు జర్నీతో పాటు.. వినోదం కూడా ఆశించే ప్రయాణికులకు తాజా పరిణామం నిరాశను కలిగిస్తుందనటంలో సందేహం లేదు.