జగన్ కి సీతక్క రిక్వెస్ట్...  వైరల్

May 31, 2020

వాహనం వెళ్లలేని మారుమూల ప్రాంతాలతో సహా తన నియోజకవర్గం మొత్తం చుట్టేసి సాయం చేసిన సీతక్క తెలంగాణలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. ఎండాకాలంలో నాలుగు అడుగులు వేయడం కష్టం. అలాంటిది దారే లేని కొండ కోనల్లో కూడా కిలోమీటర్ల కొద్దీ నడిచి నడిచి వెళ్లి... అందరికీ సాయం చేసింది. తిండి పెట్టింది. డబ్బులు ఇచ్చింది. సరుకులు ఇచ్చింది. తనకు చేతనైన ప్రతిసాయం చేసింది.

అయితే తాజాగా ఆమె తన నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా గూడాలకు కూడా వెళ్లింది. కొండలు, గుట్టలు దాటుకుని .. దాదాపు నాలుగున్నర గంటలసేపు ప్రయాణించి జిల్లాలోని చింతలపాడు వెళ్లారు. అక్కడ కొండరెడ్డి గూడెంలో, కోయ గూడెంలో నివాసం ఉండే కొండ రెడ్ల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె, ఉప్పు వంటి నిత్యావసర సరుకులు అందజేశారు. 

నిత్యావసరాలు, కుటుంబానికి 500 రూపాయలు సహాయం అందించారు. ఆమె సాయానికి స్థానికులు ఉప్పొంగి పోయారు. ఆనందంలో డోలు మోగించుకుంటూ స్వాగతం పలికారు. సీతక్కతో పాటు అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు , TJS నాయకురాలు భవాని రెడ్డి తదితరులు ఉన్నార. ఈ సందర్భంగా ఏపీ  సీఎం జగన్ కి ఆమె ఒక వీడియో సందేశం పంపారు. వారిని కాపాడాలంటూ ఓ వీడియో ద్వారా జగన్ ని రిక్వెస్ట్ చేశారు. మరి జగన్ ఏం స్పందిస్తారో చూడాలి.