శేఖ‌ర్ క‌మ్ముల‌కు బిగ్గెస్ట్ అవార్డ్

August 05, 2020

తెలుగు ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. ఆయ‌న ఏ సినిమా తీసినా మ‌న‌సుతో తీస్తాడు. శేఖ‌ర్ వ్య‌క్తిత్వం కూడా ఆయ‌న సినిమాల్లో క‌నిపిస్తుంది. ఏం మాట్లాడినా.. ఏం చేసినా అందులో ఓ నిజాయితీ క‌నిపిస్తుంది. స‌మాజం ప‌ట్ల ఓ బాధ్య‌తతో వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తిలా క‌నిపిస్తాడు శేఖ‌ర్.

లాక్ డౌన్ టైంలో శేఖ‌ర్ పెద్ద‌గా ప్ర‌చార హ‌డావుడి లేకుండా సైలెంటుగా సేవా కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ పోయాడు. హైద‌రాబాద్‌లో తానుండే ప‌ద్మారావు న‌గ‌ర్‌కు స‌మీపంలోనే క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించే గాంధీ హాస్పిట‌ల్లోని సిబ్బంది మొత్తానికి శానిటైజేష‌న్ కిట్లు అందించింది శేఖ‌ర్ టీం. వైద్యుల‌తో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి కూడా కొన్ని నెల‌ల‌కు స‌రిప‌డా పారిశుద్ధ్య సామ‌గ్రిని శేఖ‌ర్ అందించాడు.

శేఖ‌ర్ త‌మ ప‌ట్ల చూపించిన శ్ర‌ద్ధకు ముగ్ధులైన సిబ్బంది అత‌డికి త‌మదైన శైలిలో కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.
ఒక్కొక్క‌రు ఒక్కో అక్ష‌రంతో ఉన్న ప్లకార్డును ప‌ట్టుకుని.. థ్యాంక్ యూ శేఖ‌ర్ క‌మ్ముల అనే మెసేజ్‌ను ప్ర‌ద‌ర్శించారు గాంధీ ఆసుప‌త్రి సిబ్బంది. ఇలా ప్ర‌త్యేకంగా శేఖ‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారంటే ఆయ‌న చారిటీకి ఎంత ఇంప్రెస్ అయ్యారో అర్థం చేసుకోవ‌చ్చు.

దీనికి సంబంధించిన ఫొటో ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఫొటోపై శేఖ‌ర్ కూడా స్పందించాడు. వీళ్ల ప్రేమ‌కు తాను పొంగిపోతున్నాన‌ని.. ఇది వెల క‌ట్ట‌లేని గుర్తింపు అని.. ఇది త‌న‌కు ద‌క్కిన అతి పెద్ద అవార్డుగా భావిస్తాన‌ని శేఖర్ అన్నాడు.

తాను చేసిన చిరు సాయం గాంధీ ఆసుప‌త్రిలోని పారిశుద్ధ్య కార్మికుల హృద‌యాల్ని తాక‌డం చాలా సంతోషంగా ఉంద‌ని.. ఐతే వాళ్లు చేస్తున్న దాంతో పోలిస్తే తాను చేసింది చాలా చిన్న సాయం అని అన్నాడు శేఖ‌ర్‌. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్ స్టోరీ సినిమాను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.