జగన్ తీరుపై చెలరేగిన చంద్రబాబు 

August 10, 2020

తెలుగుదేశం - యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పోరు రోజురోజుకు ముదురుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతి విషయాన్ని తెగేదాకా లాగుతోంది. ఒక్కో టీడీపీ నేతపై వారు పెడుతున్న వరుస కేసులు ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎవరు చెప్పేది నిజమో తెలియక జనం తలగోక్కునే పరిస్థితి.

తాజాగా మచిలీపట్నంలో జరిగిన హత్య వెనుక మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదైంది. ఇతరులతో పాటు రవీంద్రను కూడా ఇందులో చేర్చారు పోలీసులు. తమకు అందిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ బీసీలను టార్గెట్ చేసిందని, బీసీలను ఎట్టి పరిస్థితుల్లో ఎదగకుండా అడ్డుకోవడానికి బలంగా ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలపై ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు పెట్టారు. ఇపుడు అవి అన్ని అయిపోయాయని హత్య కేసులు పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, బలహీన వర్గాల నాయకత్వాన్ని వైసీపీ ఎందుకు సహించలేకపోతోందని... బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు? అంటూ నిలదీశారు.

అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టారు. యనమల రామకృష్ణుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారు.  బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే మంత్రులు దాడి చేశారు... అని చంద్రబాబు ఆరోపించారు. అన్నీ అయిపోయాయి ఇపుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయిస్తారా? మీకు లొంగి ఉండాల్నా... లొంగకపోతే కేసులతో వేధిస్తారా? అంటూ చంద్రబాబు నిలదీశారు. మీరు చేసిన తప్పులను ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా? మీకు హత్యా రాజకీయాలు అలవాటైతే అందరికీ వాటిని అంటగడతారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. కాలం గిర్రున తిరుగుతుంది... ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు మంచి చేయండి. లేదు ప్రతీకార రాజకీయాలే చేస్తాం అని మీరు ముందుకు పోతే దారుణమైన ఫలితాలు అనుభవిస్తారు భవిష్యత్తులో అని చంద్రబాబు హెచ్చరించారు.