అయోధ్య తీర్పును గౌరవిస్తున్నాం... కానీ

July 15, 2020

అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి 134 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి తన తాజా తీర్పుతో పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం తాజాగా తన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద భూమి రామజన్మభూమి న్యాస్ కు అప్పగిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు రియాక్ట్ అయ్యింది.
న్యాయపరంగా ఎలాంటి అడుగు వేయాలన్న దానిపై తాము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన బోర్డు.. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదని చెప్పింది. తీర్పులో తమకు ఆమోదయోగ్యం కాని అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఎగ్జిక్యుటివ్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నట్లు చెప్పింది.
15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే..15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా? అని ప్రశ్నించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు.. తదుపరి కార్యాచరణకు తాము సిద్దమవుతామని పేర్కొంది. ఈ తీర్పును తాము గౌరవిస్తున్నప్పటికీ సంతృప్తిగా మాత్రం లేమన్న మాటను బోర్డు తరపున న్యాయవాది జఫర్ యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు.
తీర్పు కాపీ మొత్తం చదివిన తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో నిర్ణయించుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. ఏఎస్ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదన్నారు.రివ్యూ పిటిషన్ వేసే విషయంలో కమిటీతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.