అయోధ్య తీర్పులో..అస‌లు ట్విస్టు ఇప్పుడే

June 01, 2020

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిరానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అస‌లు ట్విస్టు ఇప్పుడు తెర‌మీద‌కు రానుంది. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై సుప్రీంకోర్టు గ‌త‌ శనివారం తీర్పునిస్తూ.. అయోధ్యలో మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణం కోసం కేంద్రం కేటాయించే ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరించాలా? వద్దా? అనే మీమాంస సాగుతుండ‌గా...తీర్పుతో తాము సంతృప్తిగా లేమని ముస్లిం కక్షిదారులైన ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది. ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి, ముస్లిం కక్షిదారుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన జఫర్యాబ్‌ జిలానీ ఈ మేర‌కు వెల్ల‌డించారు.
జఫర్యాబ్‌ జిలానీ మీడియాతో మాట్లాడుతూ....తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే తీర్పు తమను అసంతృప్తికి గురిచేసిందన్నారు. తాము మొత్తం తీర్పును వ్యతిరేకించడం లేదని, కొన్ని అంశాలతో మాత్రం విభేదిస్తున్నామని తెలిపారు. వివాదాస్పద స్థలంతోపాటు, ప్రాంగణాన్ని కూడా హిందువులకే అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. తీర్పులో అనేక పరస్పర విరుద్ధ వాదనలు ఉన్నాయన్నారు. తీర్పు ప్రతిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత రివ్యూకు వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. త్వరలో ఏఐఎంపీఎల్‌బీ వర్కింగ్‌ కమిటీ సమావేశమై తీర్పు గురించి క్షుణ్ణంగా చర్చిస్తుందని తెలిపారు. అనంతరం న్యాయపరంగా తీసుకోవాల్సిన అన్ని మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఏదిఏమైనా తీర్పులోని కొన్ని అంశాలు దేశ లౌకిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు. లక్నోలోని నవ్దా కాలేజీ ప్రాంగణంలో జ‌రిగిన‌ ముస్లిం పర్సనల్ బోర్డు సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం వెలువ‌రించారు.
ఇదిలాఉండ‌గా, యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫార్‌ ఫారుఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణానికి స్థలం తీసుకునే విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ‘నవంబర్‌ 26న బోర్డు సాధారణ సమావేశం జరిగే అవకాశముంది. మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించే స్థలాన్ని తీసుకోవాలో, లేదో ఆ సమావేశంలో నిర్ణయిస్తాం. స్థలాన్ని తీసుకునే అంశంలో నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, ప్రతికూలతను సానుకూల దృక్పథంతోనే గెలువాలని నేను వ్యక్తిగతంగా భావిస్తాను’ అన్నారు. బాబ్రీ మసీదు కోసం కేటాయించే స్థలాన్ని తీసుకోవద్దని కొందరు తనకు సలహాలు ఇస్తున్నారని, అయితే ఈ నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశముందన్నారు. మసీదు కోసం కేటాయించే స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుతో పాటు మరొక విద్య సంస్థ కూడా తీసుకోవాలని, సదరు విద్యాసంస్థ ప్రాంగణంలో మసీదు నిర్మాణం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నట్టు ఫారుఖీ తెలిపారు.