టోన్ మారింది... టీవీ9లో గట్టిగా చెబుతున్నారు

June 04, 2020

టీవీ9 వార్తల్లో ఏనాడూ యాజమాన్యపు ఛాయలు కనిపించలేదు. అసలు ఆ ఛానెల్ అధినేత 15 సంవత్సరాల్లో ఏనాడూ తన పేరును టీవీ9లో ప్రకటించలేదు. వ్యాపారం పెట్టాడు. రవిప్రకాష్ కి అప్పగించారు. అతను అంతా నడిపించారు. చెప్పాలంటే... అది ఒక పబ్లిక్ టీవీగా అయిపోయింది. వ్యాపార దృక్పథంతోనే అలా నడిపినా ఆ ప్లాన్ అయితే బాగా నడిచింది.

తాజాగా టీవీ9 చేతులు మారింది. పలుమార్లు టీవీ9 సేల్ దాకా వచ్చి రెండు మూడ డీల్స్ ఆగిపోయాయి. చివరకు జూపల్లి రామేశ్వరరావుకు చెందిన అలంద మీడియా టీవీ9ను కొనేసింది. దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు తాజాగా పూర్తవడంతో ఇపుడు ఆ ఛానెల్ పూర్తిగా మైహోం గ్రూప్ అధినేత చేతుల్లోకి వచ్చేసింది. ఈ చేతులు మారడం అన్నది రవిప్రకాష్ వివాదం వల్ల బాగా వార్తల్లో నిలిచింది. కేసుల దాకా వెళ్లింది. ఇదిలా ఉండగా... అవకాశం వచ్చినపుడల్లా టీవీ9 రామేశ్వరరావుది అని పదేపదే ప్రకటిస్తున్నారు. టీవీ9లో మాదే మాదే ఈ ఛానెల్ అని రామేశ్వరరావు పదేపదే చెప్పించుకుంటున్నారు. 

ఈరోజు జూపల్లి రామేశ్వరరావు సోదరుడి కూతురు వివాహం నొవాటెల్ లో జరిగింది. దీనికి పలువురు పెద్దలు హాజరయ్యారు. కేసీఆర్, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అయితే.... ఈ వార్తను టీవీ9లో చెప్పిన విధానం కొత్తగా ఉంది.

మై హోం గ్రూప్ ఛైర్మన్, టీవీ9 గ్రూప్ ఛానెళ్ల అధినేత రామేశ్వరరావు సోదరుడి ఇంట పెళ్లి అంటూ... అవసరం లేకపోయినా టీవీ9 వార్తల్లో పదేపదే ప్రకటిస్తున్నారు. టీవీ మాదే అని వారు బహిరంగంగా ప్రకటిస్తుండటం వినడానికి, ముఖ్యంగా టీవీ9లో వినడానికి కొంచెం కొత్తగా ఎబ్బెట్టుగా ఉంది.