ఈ ప్రెస్ నోట్ - ​జనసేన అనుభవరాహిత్యానికి తార్కాణం

May 24, 2020

ఈ కాలంలో సోషల్ మీడియా దెబ్బకు ఎవరైనా దిగిరాక తప్పదు. ఒక సామాన్యుడు చేసిన కామెంట్ కూడా ఫేస్ బుక్ లో వైరల్ అయితే... కార్పొరేట్ కంపెనీలే దిగొచ్చి గోడు వెళ్లబోసుకుని వివరణ ఇచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈరోజు జనసేనకు ఎదురైంది. కానీ దానిని డీల్ చేయడంలో ఆ పార్టీ ఫెయిలయ్యింది. పార్టీ నడిపేవారికి తగినంత అనుభవం లేకపోవడమే దీనికి కారణంగా పేర్కొనవచ్చు.

ఇంతకీ విషయం ఏంటంటే... నాదెండ్ల మనోహర్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రావడానికి కారణం జనసేనాధిపతి పవన్ మంగళగిరి ఆఫీసులో నిర్వహిస్తున్న సమీక్షలకు నాదెండ్ల మనోహర్ హాజరుకాకపోవడం. ‘‘పవనే గెలవలేదు. జనసేన పని అయిపోయింది. రావెల కిషోర్ వెళ్లిపోయారు, నెక్ట్స్ నాదండ్లే’’ అంటూ గాసిప్లు వచ్చాయి. దీనిపై జనసేన కలవరానికి గురయ్యింది. డ్యామేజ్ కంట్రోల్ కి దిగింది. జనసేన పార్టీ తరఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ‘‘నాదెండ్ల పార్టీ మారడంపై జరుగుతున్న ప్రచారం అబద్దమని.. ఆయన పార్టీ మారబోరని ప్రకటించింది. నాదెండ్ల అమెరికా పర్యటనలో ఉన్నారని.. అందుకే… జిల్లా సమీక్షలకు హాజరు కాలేదని’’ పేర్కొంది.
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ గ్యారంటీ కాదు. ఒకవేళ ఆయన భవిష్యత్తులో పార్టీ మారినా అందులో వింతేమీ లేదు. కాబట్టి ఈ విషయంపై నాదెండ్లతో ఖండన ఇప్పించాలి. ఏ పార్టీ అయినా ఇలాగే చేస్తుంది. పార్టీ అభిప్రాయమే అయినా నాదెండ్లతోనే చెప్పించాలి. ఇపుడు ఈ ప్రెస్ నోట్ పార్టీ రిలీజ్ చేయడం వల్ల రేపటి రోజున ఆయన పార్టీ మారితే డ్యామేజీ పార్టీకే గాని నాదెండ్లకు కాదు. అయినా నాదెండ్ల అమెరికా పర్యటనలో ఉంటే మాత్రం ప్రెస్ నోట్ విడుదల చేయడానికి అడ్డు ఏంటి? పార్టీ పెద్దలకు రాజకీయ అనుభవం లోపించడం వల్ల ముందుచూపు లేకుండా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక ముందు అయినా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే మంచిది.