మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

August 14, 2020

సంచలన తీర్పును వెలువరించింది మద్రాస్ హైకోర్టు. దక్షిణ భారత నటీనటుల సంఘం సింఫుల్ గా చెప్పాలంటే నడిగర్ సంఘానికి గత జూన్ లో జరిగిన ఎన్నికలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన ఒక ప్యానల్.. భాగ్యరాజ్ అధ్యక్షతన మరో ప్యానల్ ఎన్నికల బరిలోకి దిగింది. నాజర్ ప్యానల్ లో నటులు శిశాల్.. కార్తీ తదితరులు ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికల్ని రద్దు చేయాలని కోరుతూ సంఘ సభ్యులు బెంజిమెన్.. ఏలుమలై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని.. ఎన్నికల గడువు పూర్తి అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించినందున చెల్లవంటూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి స్పందించిన న్యాయస్థానం ఫలితం వెలువడకుండా నిలిపివేసింది. అయితే.. ఈ వాదనను తప్పు పట్టిన విశాల్ వర్గం అన్ని సరిగానే ఉన్నట్లుగా పేర్కొంది. ఎన్నికల ఫలితంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన వేళ.. సంఘ నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ విశాల్ వర్గం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారించింది. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల్ని నిర్వహించినట్లుగా తేల్చింది. ఎన్నికల్ని రద్దు చేసినట్లుగాపేర్కొనటంతో పాటు మరో మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. సంఘ సభ్యుల జాబితాను కొత్తగా తయారు చేయాలని.. ఎన్నికల పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి గోకుల్ దాస్ ను నియమిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.
అయితే.. కోర్టు నిర్ణయంపై విశాల్ వర్గం సుప్రీంకోర్టుకు వెళుతుందా? లేదంటే.. హైకోర్టు చెప్పినట్లు ఉంటుందా? అన్నది తేల్లేదు. ఇదిలా ఉంటే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఉండటమే మంచిదంటూ సంఘం నుంచి సస్పెండ్ అయిన సీనియర్ నటుడు రాధారవి పేర్కొన్నారు. కోర్టు తీర్పును స్వాగతించిన ఆయన ఇప్పటికైనా కోర్టు చెప్పినట్లుగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. మరి.. ఆయన మాటలకు విశాల్ వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.