వారి మనోభావాలు దెబ్బ తీసిన కుర్రహీరో

August 13, 2020

మొన్నటి వరకూ లవ్వు.. పువ్వు అంటూ.. సాఫ్ట్ సినిమాలు తీసిన కుర్రహీరో నాగశౌర్య.. ఇటీవల తాను రాసుకున్న సొంత కథతో అశ్వద్థామ సినిమాను చేయటం తెలిసిందే. ప్రేమ కథలు చేసి.. చేసి బోర్ కొట్టిందని.. తనకు తాను కొత్తగా ఉండేందుకే అశ్వద్థామ మూవీ చేసినట్లు సినిమా రిలీజ్ సందర్భంగా చెప్పుకున్నాడు. ప్రేమ సినిమాలు అన్నప్పుడు ఉండే చర్చలకు.. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో చేసేటప్పుడు వచ్చే క్వశ్చన్లు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి.
అబ్బాయి అలవాటు లేకపోవటం కావొచ్చు.. విషయాల పట్ల పెద్దగా అవగాహన లేకపోవటం వల్లో కానీ.. తనకు తెలిసిన పరిమితమైన అవగాహనతో చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారటమే కాదు.. కొత్త సమస్యల్లో చిక్కుకునేలా చేసింది. తాను చేసిన సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఫేస్ టు ఫేస్ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రిపోర్టర్ జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. డ్రైవర్ల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. వారికి ఆగ్రహాన్ని కలిగించేలా చేశాయి. పెద్దగా చదువుకోకుండా డ్రైవర్ లుగా పని చేసే వారు.. నేరాలకు కారణమవుతారన్న భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్లు చదువులేనివారు. . తాగుబోతులన్నట్లుగా ఆయన నోటి నుంచి మాటలు ఉన్నాయి.
దీనిపై డ్రైవర్ల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు..అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నాగశౌర్య మాటలతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని.. అతడి మీద చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. మరి.. ఈ వివాదానికి ఆదిలోనే పుల్ స్టాప్ పెట్టేలా వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.