కథ రాసింది ఒకరికి... సినిమా చేస్తోంది ఇంకో హీరో

May 27, 2020

హీరోలు కథకులుగా మారడం అరుదుగా జరుగుతుంటుంది. యువ కథానాయకుడునాగశౌర్య ఆ అరుదైన జాబితాలోనే చేరాడు. తన స్నేహితుడి కుటుంబంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ‘అశ్వథ్థామ’ కథ రాశాడు. తన ఐడియాను స్క్రిప్టుగా మార్చేందుకు శౌర్య దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడట. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరిగాడట. ఈ కథ అతడి మనసు లోతుల్లోకి చేరి.. గుండెల మీద పచ్చ బొట్టు కూడా వేయించుకున్నాడతను. ఐతే అతను అనుకోకుండా కథకుడిగా మారాడే తప్ప.. ఇకపైనా రచయితగా కొనసాగుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ శౌర్య తనలోని రచయితకు మళ్లీ అవకాశమిస్తున్నాడట. అతను ‘అశ్వథ్థామ’ విడుదలకు ముందే మరో కథ మీద పని చేస్తున్నాడట. కొన్ని నెలలుగా మరో కథ రాస్తున్నాడట. విశేషం ఏంటంటే.. ఈసారి కథ రాస్తోంది తన కోసం కాదట. వేరే హీరో కోసమట.

ఐతే ఆ హీరో ఎవరన్నది కూడా శౌర్య నిర్ణయించుకోలేదట. తాను రాస్తున్న కథ పూర్తయ్యాక అది ఎవరికి సెట్టయితే వాళ్లతో ఆ సినిమా ఉంటుందని శౌర్య ఒక నిఖార్సయిన రచయిత లాగా మాట్లాడటం విశేషం. తన సొంత బేనర్ ‘ఐరా క్రియేషన్స్’లో శౌర్య ఇంతకుముందు ‘ఛలో’, ‘నర్తనశాల’.. ఇప్పుడు ‘అశ్వథ్థామ’ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ బేనర్లో బయటి హీరోలతో సినిమాలుండవా అని అడిగితే.. తప్పకుండా ఉంటుందని చెబుతూ, తాను ప్రస్తుతం రాస్తున్న కథతో బయటి హీరోతో సొంత బేనర్లో సినిమాను నిర్మిస్తామని శౌర్య వెల్లడించాడు. మరోవైపు కె.రాఘవేంద్రరావు నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా ఓ సినిమా చేస్తారంటూ ఇంతకుముందు వచ్చిన వార్తల సంగతేంటి అని అడిగితే.. ఆ సినిమా తప్పకుండా ఉంటుందని.. కథ విషయంలో తర్జనభర్జనల వల్ల ఆ సినిమా కొంచెం ఆలస్యమైందని.. తప్పకుండా ఆ కాంబినేషన్లో సినిమా చేస్తానని శౌర్య వెల్లడించాడు.