పవన్ కు, జనసేనకు... నాగబాబు నేర్పిన పాఠమేంటి ?

August 13, 2020

నాగబాబు ప్రతి సారి ఓ గమ్యాన్ని పెట్టుకుంటాడు.

తన నడక మాత్రం గమ్యం వైపు కాకుండా ఇంకోవైపు కొనసాగిస్తాడు.

గాడ్సేను తలకు ఎత్తుకున్నా, ఆస్తుల గురించి భుజాలు తడుముకున్నా, తాజాగా టీడీపీ ఓటమి గురించి పంతం పట్టినా... నాగబాబు అనుకునేది ఒకటి. అతను పొందేది ఇంకోటి. తాజాగా వివాదాలే చూసుకుంటే అతను చేసిన మూడు తాజా ప్రయత్నాలు జనసేనకు డ్యామేజ్ చేశాయే గాని ఇంచు కూడా మేలు చేయడం లేదు. 

ఇది విశ్లేషించుకునే ముందు నాగబాబు ట్వీట్లను పరిశీలిద్దాం.

AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా, jsp వస్తుందా, బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి. ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం. టీడీపీ ప్రభుత్వ హయాం లో ap ప్రజలకి ఊడబొడిచింది ఏమి లేదు. development అంత అనుకుల టీవీల్లోను, పత్రికల్లో నే కనబడేది.
గ్రౌండ్ లో కనిపించింది తక్కువ. ప్లస్ corruption, sand mafia, call money అబ్బో ఇంకా చాల వున్నాయి. ఈ ట్విట్టర్ ఎం సరిపోతోంది. లక్ష పేజీల గ్రంథాలే రాయొచ్చు.

అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions..

Illusions లోంచి బయటకి రావాలి. లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే they అర్ welcome. కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని hallusinations అంటారు. అల్ ద బెస్ట్ ఫర్ your hallusinations.  


ఈ ట్వీట్లు చదివాక నాగబాబు లో బలంగా కనిపించిన కోరిక ఏంటి?

జనసేన గెలవాలన్న కోరిక తీవ్రంగా కనిపించిందా? 

టీడీపీ ఓడాలన్న కోరిక తీవ్రంగా కనిపించిందా? 

జగన్ గెలిచినా పర్లేదు గాని టీడీపీ గెలవకూడదు అన్న అక్కసు కనిపించిందా?

 

ఈ ట్వీట్లు నాగబాబు మానసిక స్థితిని మాత్రమే కాదు, నాగబాబు ఆలోచనా విధానం జనసేనకు ఎంత డేంజరో, జనసేన భవిష్యత్తు నిర్మాణం కంటే కూడా టీడీపీని తిట్టడం వల్ల, టీడీపీ ఓటమిని కోరుకోవడం వల్ల నాగబాబు... ఎంత సంతృప్తి, సంతోషం అనుభవిస్తున్నాడో అర్థమవుతుంది.

తన తాపత్రయం ఎలా ఉందంటే...  జనసేన గెలవడం, గెలవకపోవడం పక్కన పెట్టి, వైసీపీ గెలిచినా పర్లేదు గాని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవకూడదు, ఆ దిశగా పనిచేయండి అని కార్యకర్తలను రెచ్చగొట్టడం కనిపిస్తుంది. 

నాగబాబు తంతు వల్ల టీడీపీకి జరిగే కొత్త నష్టం ఏమీ లేదు.  ఎందుకంటే ఇప్పటికే ఇద్దరూ ప్రత్యర్థులు. మరోవిషయం... ఇపుడేమీ ఎన్నికలు కూడా లేవు. ఈ హడావుడి నాలుగురోజుల తర్వాత సద్దుమణుగుతుంది. కానీ ఈ తాజా వివాదం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాగబాబు వంటి కార్యకర్తలు అవసరమా? అనే కొత్త చర్చ మొదలైంది. బాలకృష్ణ తెలుగుదేశం కుటుంబ వ్యక్తి కావచ్చు. కానీ ఆ పార్టీ గెలుపోటములు నిర్దేశించి శక్తి కాదు. అలాంటి బాలయ్యను ప్రతిపక్షంలో ఉంచడానికి నాగబాబు పనిచేయాలా?

జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి నాగబాబు పనిచేయాలా?

ఇది పవన్ గట్టిగా ఆలోచించుకోవాల్సిన విషయం. 

2019 ఎన్నికల గురించి ఒకసారి చర్చించుకుంటే...పవన్ కోరుకున్నదేంటి? జగన్ అధికారంలోకి రాకూడదని, కానీ ఏం జరిగింది? జగనే సీఎం అయ్యారు. లక్ష్యం ఎదుటోడిని ఓడించడంలో పెట్టడం వల్ల అటు జగన్  ను దెబ్బకొట్టలేకపోయారు. అదే సమయంలో తాము కనీస సీట్లను సాధించలేకపోయారు. అదేవిధంగా అప్పట్లో నాగబాబు కోరుకున్నదేంటి? బాలకృష్ణ గెలవకూడదని. అది కూడా నాగబాబుకు వ్యతిరేకంగా జరిగింది. పైగా రివర్స్ అయ్యింది.

ఇలాంటి ఆలోచనలతో వీళ్లు పార్టీని ఎలా నడపగలరు. ఎవడైనా తాము గెలవడానికి ప్రణాళికలు రచిస్తాడు గాని ఇతరులు ఓడిపోవడానికి ప్రణాళికలు రచిస్తాడా? ఒక వేళ పగ అనుకుందాం. నీ పగ నీ సామర్థ్యం మీదనే కాదు ప్రత్యర్థి ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. అతను శక్తి సామర్థ్యాలను బట్టి అతని జయాపజయాలుంటాయి గాని ఎదుటి వారి కోరికను బట్టి కాదు కదా. నాగబాబు గట్టిగా కోరుకుంటే టీడీపీ ఓడిపోతుందా? కాదు కదా. చంద్రబాబు, లోకేష్ సరిగా పనిచేయకపోతే టీడీపీ ఓడిపోతుంది.

ఈ కామన్ సెన్స్ మిస్సయ్యి హేట్రెడ్ నెస్ తో నాగబాబు ఏం సాధిస్తారు? ఇది ఎవరికి లాభం? మెగా కుటంబం ఎందుకు మళ్లీమళ్లీ ఇలాంటి సిల్లీ తప్పుు చేస్తూ సిల్లీ లక్ష్యాలు పెట్టుకుంటుంది?
మెగా బ్రదర్ నాగబాబులో పనికి రాని దూకుడు, తన కోరిక తీరాలన్న తాపత్రయం తప్ప... ఫ్యూచర్ ప్లానింగ్ శూన్యం.

టీడీపీ ఓడిపోవాలని కోరుకునే బదులు... ఎట్టి పరిస్థితుల్లో జనసేన గెలవాలి, దానికి ఏం చేయాలి?  అపుడు అధికారంలోకి వచ్చి టీడీపీని ఎలా దెబ్బకొట్టాలి అని నాగబాబు ఆలోచిస్తూ అది ఒక పద్ధతి. కానీ తాను గెలుస్తాననే నమ్మకం లేక ఎదుటి వాడు ఓడిపోతే చాలు తాను హ్యాపీ అని కోరుకోవడం నాగబాబు బలహీనత అవుతుంది గాని బలం కాదు.

ఇప్పటికైనా జనసేన మేల్కోవాలి. 

ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలి. 

తమను నమ్ముకున్న పార్టీ శ్రేణులు కోరుకునేది టీడీపీని, బాలయ్యను, జగన్ ను ఓడించడం కాదు... జనసేన గెలవడం.

నాగబాబు, మెగా ఫ్యామిలీ తమ శక్తియుక్తులను, కార్యకర్తలను.... జనసేనను గెలిపించుకోవడానికి ఉపయోగించాలి గాని తమ పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు.

నాగబాబు జనసేనకు గుణపాఠం కావాలి !!