2024 ఏపీ ముఖ్యమంత్రి ఎవరంటే...

May 26, 2020

రాబోయే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారని నటుడు, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా ఉన్నపుడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడగడం వల్ల జనం ఒక ఛాన్స్ ఇచ్చారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాల్లో గెలుపోటములు సహజం, నాణేనికి బొమ్మాబొరుసు ఎలాగో, జీవితానికి గెలుపోటములు అలాగ‘‘ అని అన్నారు. గెలిచినంత మాత్రాన గొప్పవారు అయిపోరని, ఓడిన వారు చేతకాని వారు కాదని నాగబాబు పేర్కొన్నారు.
వైసీపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఇది రెండోసారి. జగన్ పై జనంలో సానుభూతి ఉంది. అదే సమయంలో చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అందుకే వారిపై వ్యతిరేకత పెరిగింది. వైసీపీ గెలవడానికి టీడీపీపై ప్రజలకు ఉన్న ఈ వ్యతిరేకతే ప్రధాన కారణం అయ్యింది. ఈ సారి జగన్‌కు ఒక ఛాన్స్‌ ఇద్దామనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఒకవేళ జనసేన పార్టీకి ఓటు వేసినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనే ఉద్దేశంతోనే ప్రజలు ఉండటం వల్ల మాకు పడాల్సిన ఓట్లు కూడా వైసీపీకి పడినట్లు నాగబాబు విశ్లేషించారు. అంటే పవన్, జనసేన అభిమానులు వైసీపీకి వేయడం వల్ల ఆ పార్టీ గెలిచిందన్నట్లు నాగబాబు తీర్మానించారు. ఇక అనుమానం లేదు, 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారం మాత్రం మాదే అని నాగబాబు ధీమా వ్యక్తంచేశారు.