నాగబాబు పయనమెటు, గమ్యమేంటి?

August 05, 2020

``ఈ అడవిలో బాటసారిని..... కనిపించని ధర్మానికి అన్వేషిని`` కొండవీటి దొంగ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన డైలాగ్ ఇది. కాకతాళీయమే అయినా....చాలా ఏళ్ల తర్వాత నాగబాబుకు ఈ డైలాగ్ కరెక్టుగా సూటయింది. నటుడిగా, హీరోగా, నిర్మాతగా, జబర్దస్త్ జడ్జిగా, `ప్రజారాజ్యం`లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, జనసేన ఎంపీ అభ్యర్థిగా...ఇలా అనేక రూపాల్లో కనిపించిన నాగబాబు...ఇపుడు సరికొత్త అవతారమెత్తారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న నాగబాబు....`నా ఇష్టం` అనే తన యూట్యూబ్ చానెల్లో..తనకు నచ్చిన అంశాలపై స్పందిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గాడ్సేపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక,  బాలయ్య, నాగబాబుల మధ్య జరిగిన డైలాగులు....టాలీవుడ్ ను షేక్ చేశాయి. ఆ తర్వాత లాక్ డౌన్ పై తనదైన శైలిలో స్పందించిన నాగబాబు...కొంతకాలంగా రాజకీయ పాఠాలూ చెబుతున్నారు.

ఇక, తాజాగా తత్వవేత్త అవతారమెత్తిన నాగబాబు...ఇమేజ్ అంటేనే ఓ పెద్ద ట్రాప్ అని....మంచివాడు అనిపించుకునే ఇమేజ్ కన్నా...వెధవ అనిపించుకునే ఇమేజ్ గొప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమేజ్ అనే జైలులో బ్రతకడం మనకు మనం వేసుకొనే శిక్ష అంటూ నాగబాబు...చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ, కనిపించని ధర్మాన్ని అన్వేషిస్తోన్న నాటి నాగబాబు తరహాలోనే....నేటి నాగబాబు పయనమెటు, గమ్యమేంటి? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇమేజ్ అనేది ఓ పెద్ద ట్రాప్ అని, అది మనల్ని ఓ చట్రంలో అమర్చేసి అది దాటి వెళ్లకుండా సమాజం చేయడమే ఇమేజ్ అని పెద్ద స్పీచ్ ఇచ్చారు నాగబాబు. ఐ హేట్ ఇమేజ్... నాకు ఇమేజ్ అనే మాటే అసహ్యం...అంటోన్న నాగబాబు...ఆ పదాన్ని లైక్ చేయనని, అసలు లెక్క చేయనని అంటున్నారు. మనిషికి ఇమేజ్ ఉన్నా లేకపోయినా బతికేస్తాడని, కానీ, ఓ సారి ఇమేజ్ వచ్చిన తర్వాత మన బతుకు మనం బతకడం మానేస్తామని వేదాంతం చెప్పారు.

సమాజం ఇచ్చిన ఇమేజ్ ను కాపాడుకోవడంలోనే జీవితం ముగిసిపోతుందని వైరాగ్యంగా చెప్పారు. ఇమేజ్‌లో బతకడం అనేది మనషికి నరకం లాంటిదని, బయటకు ఒకలా, లోపలా ఒకలా ఉండాల్సి వస్తుందని అన్నారు. మంచివాడు, మహానుభావుడు అనే ఇమేజ్ కంటే.. వెధవ, సన్నాసి, పనికిమాలిన వాడు అనే ఇమేజ్ చాలా బెటర్ అని హితబోధ చేశారు నాగబాబు. ఇంతకీ, నాగబాబు ఏ ఫ్రస్ట్రేషన్ లో ఈ వ్యాఖ్యలు చేశారో తెలీదుగానీ....నాగబాబు చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

ఇటువంటి కామెంట్స్ వల్ల యువత చెడ్డ ఇమేజ్ గొప్పదని ఫీల్ అయ్యే చాన్స్ ఉందని విమర్శలు వస్తున్నాయి. సినిమాలు, రాజకీయాలు, తత్వం...ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు పయనమెటు, గమ్యమేంటి? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.