అవును.. జబర్దస్త్‌ నుంచి వెళ్లిపోతున్నా

July 12, 2020

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలింది. తెలుగులో నంబర్ వన్ కామెడీ షో ‘జబర్దస్త్’ నుంచి జడ్జి నాగబాబు బయటికి వచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించాడు. ఈ గురు, శుక్రవారాలే నాగబాబు కనిపించబోయే చివరి ఎపిసోడ్స్. శుక్రవారం రాత్రి తర్వాత తాను ‘జబర్దస్త్’లో కనిపించనని నాగబాబు కన్ఫమ్ చేశాడు. తాను ఈ ప్రోగ్రాం నుంచి వైదొలగడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. వాటి గురించి స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఓపెన్ అవుతున్నానని ఆయన చెప్పారు. సైద్ధాంతిక పరమైన విభేదాలతోనే తాను ‘జబర్దస్త్’కు దూరం అయినట్లు ఆయన వెల్లడించారు. అంతే తప్ప బయట ప్రచారంలో ఉన్నట్లుగా పారితోషకం విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణం అన్నది శుద్ధ అబద్ధం అని నాగబాబు స్పష్టం చేశాడు. రెమ్యూనరేషన్ అన్నది ఇక్కడ చర్చనీయాంశమే కాదని.. నిజానికి తన స్థాయికి తగ్గ పారితోషకం ఈ ప్రోగ్రాంలో ఇవ్వకపోయినా.. తనకు ఈ ప్రోగ్రాంపై ఉన్న ఇష్టం, ఎమోషనల్ బాండింగ్ వల్లే ఏడేళ్లకు పైగా ఇందులో కొనసాగానని నాగబాబు తెలిపాడు. పారితోషకం తగినంత ఇవ్వకపోవడం వల్లే తాను వైదొలుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విషయం అది కాదని చెప్పడానికే తానీ మాటలు చెప్పాల్సి వచ్చిందని మెగా బ్రదర్ అన్నాడు. తాను ఆర్థికంగా పెద్ద సంక్షోభంలో ఉన్న సమయంలో ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం వచ్చిందని.. దీని వల్ల తాను ఆర్థికంగా నిలదొక్కుకున్న మాట వాస్తవమని నాగబాబు తెలిపాడు.  ఆ సంగతి పక్కన పెడితే.. నవ్వించే ఏ కార్యక్రమం అయినా తనకిష్టమని.. అందుకే ‘జబర్దస్త్’ను ఇష్టపడి చేశానని.. దీంతో తనది ఎమోషనల్ జర్నీ అని నాగబాబు తెలిపాడు. తాను వైదొలగడానికి కారణాలేంటో మున్ముందు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తానని నాగబాబు స్పష్టత ఇచ్చాడు.