కూరగాయలు కొంటున్న స్టార్ హీరో... ఎందుకని అడిగితే...

August 07, 2020

తెలుగు బుల్లితెర చరిత్రలో రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లో సక్సెస్ అయిన ఈ షోను ప్రముఖ చానెల్ స్టార్ మా తెలుగు వాళ్లకూ పరిచయం చేసింది. ఎన్నో అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ షోను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్‌తో సక్సెస్ చేశాడు. హోస్ట్‌గా చేసిన తొలి ప్రయత్నమే అయినా.. తెలుగు ప్రేక్షకులందరినీ ఈ షో వైపు తిప్పేలా చేశాడు. ఎన్టీఆర్ దెబ్బకు టీఆర్పీ రేటింగ్ భారీగా పెరిగిపోయింది. ఇక, నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు కూడా ఆ స్థాయిలో కాకపోయినా మంచి స్పందనే వచ్చింది.

దీంతో ‘బిగ్‌బాస్’ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సారి హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్, నాని ఆసక్తి చూపకపోవడం స్టార్ మాకు పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని హోస్టుగా పెడతారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ఆసక్తికర విషయాలు ప్రచారం అయ్యాయి. ఆ హీరో చేస్తున్నాడని ఒకరు రాస్తే.. కాదు కాదు ఈయన హోస్ట్ చేస్తున్నాడంటూ మరొకరు రాస్తూ వచ్చారు. తాజాగా వీటన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ స్టార్ మా చానెల్ ‘బిగ్‌బాస్-3’ హోస్ట్‌ను ఎవరో రివీల్ చేసేసింది.

‘బిగ్‌బాస్-3’ హోస్ట్ మరెవరో కాదు.. ఐదు పదుల వయసులోనూ తన అందంతో ఎంతో మందిని పడేస్తున్న మన్మథుడు అక్కినేని నాగార్జున. అవును.. ఈ సీజన్‌ను నాగ్ హోస్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో నాగ్ కూరగాయలు, ఇంటికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. కొందరు మీరెందుకు ఇవి కొంటున్నారని ప్రశ్నించగా.. ‘‘ఈ సారి నేనే రంగంలోకి దిగుతున్నాను. ఈ సరుకులన్నీ ఈ సీజన్ హౌస్‌కే’’ అంటూ అసలు విషయం చెబుతారు నాగార్జున.

వాస్తవానికి కొంతకాలంగా ఈ సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నిజమైంది. మరి, తారక్, నానిలా నాగార్జున కూడా ఆకట్టుకుంటారా అంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు. అయితే, గతంలో నాగార్జునకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేసిన అనుభవం ఉండడం కలిసొచ్చే అంశమని పలువురు అంటున్నారు. మరోవైపు, ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొంటారు..? ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది..? అనేది కొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.