జగన్ ఉక్కిరి బిక్కిరి-  నిన్న సుప్రీం తీర్పు - నేడు ఆ కేసు

August 05, 2020

ఏపీలో కరోనా కంటే పెద్ద విషయాలున్నాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలబడేలా కరోనా కేసులు నమోదవుతున్నా అది కాకుండా రాష్ట్రంలో ఇంకా సంచలనాలు ఉన్నాయంటే అక్కడి రాజకీయం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాపానికి ఏపీ ప్రభుత్వం తీరు ఒక మనిషిని చంపేసిందని...  ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవలే సోషల్ మీడియా కేసులో అరెస్టై విడుదలైన నలంద కిషోర్ మృతిచెందడంతో రఘురామరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయన గంటా శ్రీనివాసరావు అనుచరుడు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కరోనా లేని అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.

సీఐడీ పోలీసులు అతడిని అరెస్టు చేస్తే విశాఖ నుంచి కర్నూలుకు తరలించి విచారించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. చాలారోజులు ఆ గొడవ నడిచింది. బెయిలు రావడంతో అతను విడుదల అయ్యారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. తాజాగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి  తరలించగా మరణించాడు. అతను మరణించడంపై నరసాపురం ఎంపీ రఘురామరాజు మండిపడ్డారు.

‘‘అరోగ్యం బాగాలేకపోయినా నలంద కిషోర్‍ను కర్నూలుకు తీసుకెళ్లారు - కిషోర్‍ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి - కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్‍లో కిషోర్‍ను పెట్టారు - కిశోర్‍కు కరోనా వచ్చినట్లు ఉంది - ఇది పోలీసు హత్యగానే భావించాలి - కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారు - భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు - మాట్లాడే హక్కే కాకుండా జీవించే హక్కునూ హరిస్తున్నారా? - మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకు? - ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోండి‘‘ అంటూ రఘురాముడు గట్టిగా జగన్ ను తప్పు పట్టారు.

సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన మనం ఎల్లకాలం మనుగడ సాధిస్తాం అనుకోవడం భ్రమ అని... దీనిని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని రఘురామరాజు సూచించారు. ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి - కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.