నామా.. ధైర్యం చేయడానికి అసలు కారణం ఇదే

September 17, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కనిపిస్తుంటే తెలంగాణలో మాత్రం లోక్‌సభ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టుపార్టీలు, బీజేపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీనికి తోడు తెరపైకి కొత్త అభ్యర్థులు వస్తుండడంతో ఈసారి పోటీకి ఎవరు దిగుతారన్న దానిపై చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తన ప్రసంగంతో పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఇలా నడుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తు ఎన్నికల్లో ఓటమి.. తాజాగా ఎమ్మెల్యేల రాజీనామాతో ఢీలా పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధిష్ఠానం.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ పార్టీ నేతలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా టీడీపీకి పట్టున్న ఖమ్మం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పార్టీ వీడడానికి సైతం సిద్ధమయ్యారు.

టీడీపీ ఒంటరిగా పోటీచేసినా కాంగ్రెస్‌తో జతకట్టి ఖమ్మం సీటు టీడీపీ తీసుకుంటే మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బరిలో దిగాలని భావించారు. అయితే, అధిష్ఠానం నుంచి స్పష్టత రాకపోవడంతో ఆయన టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరపున 2009లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు... 2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని, అయితే.. టీడీపీ తరపున పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదనే అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో గురవారం అమరావతిలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి నామా నాగేశ్వరరావు డుమ్మా కొట్టడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. తమ పార్టీలో చేరితే ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సంకేతాలు రావడం వల్లే...ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ కారణంగానే ధైర్యం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.