జగన్ భార్యతో... నమ్రత మీటింగ్... ఏంటి కథ?

February 23, 2020

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తితో టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ భేటి అయ్యారు. న‌మ్ర‌తా భార‌తితో భేటీ కావ‌డానికి ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ నివాసంలో ఇద్ద‌రి భేటీ జ‌రిగింది. వైఎస్ భార‌తిని న‌మ్ర‌త అంత ప్ర‌త్యేకంగా క‌లుసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది అనుకుంటున్నారు ఏపీ జ‌నాలు, మ‌హేశ్‌బాబు అభిమానులు. ఇంత‌కు న‌మ్ర‌త సోలోగా భార‌తిని క‌ల‌వడం ఏమిటి అని అనుకుంటున్నారా ?  కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌కంగానే క‌లిసిన‌ట్లు పైకి చెపుతున్నా.. ఊరికే రారు మ‌హానుభావులు అన్న‌ట్లుగా న‌మ్ర‌త క‌ల‌వ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.

ప్రిన్స్ మ‌హేష్‌బాబు త‌న గుంటూరు జిల్లా తెనాలి మండ‌లంలోని స్వ‌గ్రామ‌మైన బుర్రిపాలెంను ద‌త్త‌త తీసుకున్నారు. ఏపీలో బుర్రిపాలెంతో పాటుగా, తెలంగాణ‌లోని సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా ద‌త్త‌త తీసుకున్నారు. శ్రీ‌మంతుడు సినిమాలో న‌టించిన సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు తన స్వ‌గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని, అక్క‌డ అభివృద్ధి ప‌నుల‌కు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు అదే ప‌నిమీద న‌మ్ర‌త భార‌తిని క‌లిసారు. బుర్రిపాలెంను గ్రామం ఫౌండేష‌న్ త‌రుపున ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి ప‌నులు చేస్తున్న‌ట్లు దీనికి ప్ర‌భుత్వం త‌రుపున స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని భార‌తిని న‌మ్ర‌త కోరారు. దీనికి భార‌తి త‌న‌వంతుగా స‌హకారం అందిస్తాన‌ని, సీఎం దృష్టికి తీసుకువెళ‌తాన‌ని మాటిచ్చార‌ని సమాచారం.
జ‌గ‌న్ సీఎం అయ్యాక నాలుగు నెల‌ల త‌ర్వాత ఈ భేటి జ‌ర‌గ‌డం ప‌ట్ల రాజ‌కీయంగా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. జ‌గ‌న్ సీఎం గా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి సిని ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఎవ్వ‌రు అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి దంప‌తులు సీఎం జ‌గ‌న్ నివాసంకు వెళ్ళి అక్క‌డే లంచ్ మీటింగ్ జ‌రిపారు. త‌రువాత ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్‌బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త జ‌గ‌న్ నివాసానికి వెళ్ళ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే త్వ‌ర‌లో మ‌హేష్‌బాబు కూడా సీఎంతో భేటీ కానున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.
మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా సంక్రాంతి కి విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాకు ప్రిమియ‌ర్ షోలు వేసుకునేందుకు ఏపీ స‌ర్కారు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్ర‌స్తుతం సినిమా స్టార్ల‌కు ఉన్న రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో కూడా ముంద‌స్తుగానే నమ్ర‌త‌ను ఇలా పంపార‌ని, త‌రువాత మ‌హేష్‌బాబు వెళ్ళ‌నున్న‌ట్లు టాక్‌.