బాబు కోసం మరో నందమూరి సింహం... వైసీపీకి వార్నింగ్

July 12, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలు మితిమీరిపోయాయనే చెప్పాలి. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ఆయనపై విమర్శలు చేయాలంటేనే జడిసిన నేతలు... జగన్ సీఎం కాగానే... వైసీపీ నేతలు కట్టు తప్పిపోయారు. రాజకీయ విమర్శలను దాటేసి... వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారు. వెరసి వైసీపీలోని చాలా మంది నేతల నోట బూతు మాటలు కూడా వస్తున్నాయి. తాజాగా టీడీపీలోనే ప్రత్యేకించి చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాజకీయ ఓనమాలు దిద్దిన వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని లాంటి నేతలతోనే చంద్రబాబును తిట్టిస్తున్న వైనం కూడా ఇప్పుడు ఆందోళన కలిగించేదే. ఈ తరహా కొత్త విమర్శలపై టీడీపీ నేతలు ఓ రేంజిలో విరుచుపడుతూనే ఉన్నారు. 

తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు మనవడు, నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ఎంట్రీ ఇచ్చేశారు. రాజకీయంగా ఎవరు ఎవరిని విమర్శించుకున్నా పట్టించుకోబోమని, అలాగని వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దంటూ చైతన్య కృష్ణ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన వార్నింగ్ తో కూడిన ఓ వీడియోను చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో చైతన్య కృష్ణ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘కొడాలి నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మామయ్య చంద్రబాబు.ఆయననను నోటికొచ్చినట్లు దూషిస్తే సహించేది లేదు. విధివిధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోండి. అంతేగానీ వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు’ అని చైతన్య కృష్ణ వైసీపీ నేతలకు ప్రత్యేకించి ఇటీవల నోరు పారేసుకుంటున్న నాని, వంశీలకు కాస్తంత గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.