అప్పుడు బన్నీ.. ఇప్పుడు నాని

February 23, 2020

కాలం కలిసి వచ్చినపుడు యావరేజ్ కంటెంట్‌తో కూడా కొన్నిసార్లు హిట్లు కొట్టేస్తుంటారు హీరోలు. అది అడ్డం తిరిగినపుడు మంచి కంటెంట్ ఇచ్చినా జనాలు రివీస్ చేసుకోరు. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్‌ కొన్నేళ్ల కిందట మామూలు ఊపులో ఉండేవాడు కాదు. చూస్తుండగానే ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయిన అతను.. ఒక దశలో మామూలు సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ రూ.56 కోట్ల దాకా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇక ‘సరైనోడు’ సంగతి చెప్పాల్సిన పని లేదు. దీనికి కూడా డివైడ్ టాక్ వచ్చింది. అయినా అది బ్లాక్ బస్టర్ అయింది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘దువ్వాడ జగన్నాథం’కు సైతం ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. కానీ ‘డీజే’ సమయంలోనే అతడి మీద నెగెటివిటీ మొదలైంది. ఆ ప్రభావం ఆ తర్వాతి సినిమా ‘నా పేరు సూర్య’ మీద పడింది. ఆ సినిమా మరీ తీసిపడేయదగ్గదేమీ కాదు. అయినా పెద్ద డిజాస్టర్ అయింది. బన్నీ వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్న సమయంలోనే కొంచెం అతి చేయడంతో అతడి మీద నెగెటివిటీ మొదలై.. ‘నా పేరు సూర్య’ను తిప్పి కొట్టారు ప్రేక్షకులు. ఏ హీరో అయినా ఇక తనకు తిరుగులేదు అనుకుంటే ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు ఊరికే హిట్లు ఇచ్చేసే ప్రేక్షకులు.. ఇంకొన్నిసార్లు మరీ కఠినంగా ఉంటారనిపిస్తుంది ఇలాంటి పరిణామాలు చూస్తే. నేచురల్ స్టార్ నాని పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. అతను ఒకప్పుడు ‘ఎంసీఏ’ లాంటి సాధారణమైన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి నానిని ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకుని ప్రతి సినిమానూ హిట్ చేస్తూ వెళ్లారు. ‘మజ్ను’ లాంటి మరో మామూలు సినిమా కూడా మంచి వసూళ్లే రాబట్టింది. కానీ అతడి విజయాల్ని చూసి ప్రేక్షకులకే కన్ను కుట్టిందో ఏమో.. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రానికి మరీ దారుణమైన ఫలితాన్ని కట్టబెట్టారు. అది మరీ అంత పెద్ద ఫ్లాప్ కావాల్సిన సినిమా కాదు. అయినా అయింది. ఆపై ‘దేవదాస్’ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆడలేదు. ‘జెర్సీ’కి వచ్చిన టాక్‌కు బ్లాక్ బస్టర్ కావాలి.  కానీ ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మొత్తానికి వరుస హిట్లను చూసి ఇక తమకు తిరుగులేదని ఆ హీరో అనుకున్నా.. లేదా ఇంకెవరు అనుకున్నా కథ అడ్డం తిరగడానికి ఎంతో సమయం పట్టదు అనడానికి ఇవి ఉదాహరణలు.