నారా లోకేష్ కీలక నిర్ణయం

August 10, 2020

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెల్లగా ఫీల్డులోకి దిగుతున్నారు. ఇటీవలే అనంతపురం పర్యటన చేసిన నారా లోకేష్ స్వయంగా జేసీ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తాం అని సీమ గడ్డపై నిలబడి వార్నింగ్ ఇచ్చారు అధికారి పార్టీకి. 

తాజాగా లోకేష్ శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి బయలుదేరి  శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని నిమ్మాడ గ్రామంలో పరామర్శించనున్నట్లు పార్టీ తెలిపింది. 

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో కొద్దిరోజుల క్రితం ఏపీ సీఐడీ తెలుగుదేశం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అపుడే శస్త్రచికిత్స జరిగిందని తెలిసినా సీఐడీ అధికారులు వినకుండా అరెస్టు చేశారు. అంతేకాదు, మానవ హక్కుల చట్టం ప్రకారం బాధితుడి పరిస్థితిని గమనించి స్థానిక ఆస్పత్రిలో పోలీసుల అదుపులో ఉంచుకోవచ్చు. కానీ అలా చేయకుండా పైల్స్ ఆపరేషన్ అయిన వ్యక్తిని 500 కిలోమీటర్లు తిప్పారు. దీంతో పోలీసుల వ్యవహార శైలి  కారణంగా అచ్చెన్నాయుడికి మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.

 జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా ఆస్పత్రిలో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే, ఆపరేషన్ అయింది కాబట్టి ఆస్పత్రిలోనే సర్జన్ సమక్షంలోనే విచారించాలని యతాతథ స్థితిలో విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే... నిన్న అర్ధరాత్రి అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జి చేసే ప్రయత్నాలు చేసినట్టు తెలుగుదేశం ఆరోపించింది. చివరకు మీడియా, పార్టీ నాయకులు రావడంతో డిశ్చార్జి ప్రయత్నాలు ఆపేసినట్లు పార్టీ చెప్పింది. 

ఇదిలా ఉండగా అరెస్టయిన రోజు రాత్రి లోకేష్ మంగళగిరి వెళ్లారు, ఆ తర్వాత ఆస్పత్రి వద్దకు చంద్రబాబు వెళ్లారు. కానీ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేదు. 

అచ్చెన్నాయుడికి ప్రభుత్వం వల్ల ప్రాణాాపాయం ఉందని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆందోళనలో ఉన్న అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ రేపు శ్రీకాకుళం వెళ్లనున్నారు.