సంస్కారవంతమైన సెటైర్ వేసిన లోకేష్

May 26, 2020

అనూహ్య రీతిలో ఎన్నికల్లో దక్కిన గెలుపుతో జగన్ తన బుర్రలో హిస్టరీ డిలీట్ అయిపోయినట్టుంది. ఈరోజు కాళేశ్వరం గురించి, గోదావరి కృష్ణా అనుసంధానం గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా జగన్ కేసీఆర్ అంత కరుణామయుడు ఈ లోకంలో లేడు అన్నట్లుగా మాట్లాడారు. కాళేశ్వరం వల్ల ఏపీ నష్టపోతోందని, దానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళతారు అని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. 

అరె చంద్రబాబు దొరికాడు అన్నట్లు... మీ హయాంలోనే కదా ఆ ప్రాజెక్టు కట్టింది. అప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేసింది. విమర్శలు చేయడంలో తప్పులేదు గాని దిగజారి మాట్లాడటం మంచిది కాదు అని చంద్రబాబుతో పాటు ఇతర నేతలు జగన్ ను హెచ్చరించారు. జగన్ భాషలో ట్విట్టరులో లోకేష్ తనదైన రీతిలో పంచ్ లు వేశారు.

‘‘కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ?‘‘ అని వైఎస్ జగన్ గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇదిగో ఈ క్లిప్పింగ్ (పైనున్న చిత్రం) ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి'లో వచ్చిన వార్త. కాళేశ్వరంపై అప్పుడు చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే స్వయంగా మీ పత్రికలోనే వేశారు. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారేమో, సాక్షిలో వచ్చిన ఈ వార్త చూసి ఉండరు‘‘ అంటూ లోకేష్ కడిగి పారేశారు. 

మరీ ఏకంగా సాక్షి పత్రిక క్లిప్పింగే పెట్టేసరికి వైసీపీ ప్రభుత్వానికి సౌండ్ లేదు. అప్పట్లో జగన్ కూడా ధర్నా చేశారు. యుటర్న్ తీసుకుని ఈరోజు అదే ప్రాజెక్టును పొగుడుతున్నారు. కానీ చంద్రబాబు అడ్డుకోలేదని అంటున్నారు. దానిని తిప్పి కొడుతుూ ఆరోజు ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో వెలుగులోకి తెచ్చారు నారా లోకేష్.