ఏపీ సర్కారుపై లోకేష్ సెటైర్ ఓ రేంజ్ లో పేలిందిగా

August 12, 2020

ఇకపై ఎవరైనా ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో మెసేజులు పెట్టాలంటే... ఏపీ సీఎం జగన్ ఈ మెసేజ్ పెట్టొచ్చా అని పర్మిషను తీసుకోవాలేమో అని ఏపీ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు వేశారు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  ఈరోజు ఆయన అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్లారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పార్టీ మొత్తం మీతోనే ఉందని భరోసా ఇచ్చారు.

ఆయనతో పాటు ఎర్రన్నాయుడి కొడుకు రామ్మోహన్ నాయుడు, కూతురు ఆదిరెడ్డి భవాని (ఎమ్మెల్యే-రాజమండ్రి) ఉన్నారు. జిల్లా తెలుగుదేశం నేతలు కూడా లోకేష్ తో పాటు ఉన్నారు. జగన్ పార్టీ అవినీతిని బాహుబలినా ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసి స్కాంలో ఇరికిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

రోజరోజుకు ప్రభుత్వం తప్పుదారిలో నడుస్తుందని, వేధింపులు పెరిగాయని... అన్నారు. ఇసుక సమస్యపై మాట్లాడిన కూన రవికుమార్‌ని ఇబ్బంది పెట్టారు. 10శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారు. అశోక్ గజపతి రాజును మాన్సాస్ ట్రస్ట్ నుంచి బయటకు పంపారు అని లోకేష్ ఆరోపించారు.

దేవుడు ఉన్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. వడ్డీతో  సహా అన్ని వైకాపా అధినేతకు తిరిగి చెల్లిస్తామని లోకేష్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతి ఓటరుకి, ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉంటుందని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. జగన్ అన్నా ఈ మెసేజ్ పెట్టొచ్చా అని ఫేస్ ‌బుక్, వాట్సాప్‌లో మెసేజ్ పెట్టే ముందు నన్ను అడగాలంటాడేమో,  చివరకు భర్త భార్యకు మెసేజ్ పెట్టాలన్నా ప్రభుత్వాన్ని అనుమతి కోరాలంటారేమో. మరి  ఏపీలో నడుస్తున్నది రాజారెడ్డి రాజ్యాంగం కదా అని మండిపడ్డారు లోకేష్. 

మైన్స్, గ్రానైట్స్ వ్యాపారాలు ఉన్న వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు... ఏమీ లేని వారిని ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారు అని విమర్శించారు లోకేష్. ఈ పర్యటనలో భాగంగా కోటబొమ్మాళిలో ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి లోకేష్ నివాళులు అర్పించారు. 

లోకేష్ మరిన్ని పంచ్ లు -

ఏపీ లో విధ్వంసం ఫుల్లు... అభివృద్ధి నిల్లు

దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం... ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం