పోలవరంపై నారా లోకేష్‌కు అడ్డంగా దొరికిపోయిన జగన్

July 04, 2020

పోలవరం ప్రాజెక్టు పనులపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దొరికిపోయారా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలలేదని ఎన్నికలకు ముందు ప్రచారంలో పదేపదే చెప్పిన జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పోలవరం ప్రాజెక్టు పనులు 58 శాతం పూర్తయ్యాయని సుప్రీం కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారని దుయ్యబడుతున్నారు.

నాడు ఎన్నికల సమయంలో అసత్య ప్రచారం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు పాలించిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు పునాదులు కదిలి ముందుకు కదలలేదని, ఈ ప్రాజెక్టు అవినీతిమయమైందన్నారు. వైసీపీ నేతలు కూడా పోలవరంలో ఎలాంటి కదలిక లేదని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తప్పు అని నిరూపించేందుకు నాడు టీడీపీ ప్రభుత్వం బస్సుల్లో ప్రజలను పోలవరం సందర్శనకు తరలించింది. అక్కడకు వెళ్లిన వారు పోలవరం పనులు ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేసారు. కానీ వైసీపీ నేతలు మాత్రం... కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు.

అప్పుడు ఏ వైసీపీ అయితే పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పిందో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు 58 శాతం పూర్తయినట్లు భారత అత్యున్నత న్యాయస్థానానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిందని, ఏ పని ఎంత పూర్తయిందో కూడా సవివరంగా వివరించిందని గుర్తు చేస్తున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు సుప్రీంకు సమర్పించిన స్టేటస్ రిపోర్టును తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 'ఇది కల్పితం.. దిస్ ఈజ్ వాస్తవం' అని పేర్కొంటూ.. చంద్రబాబు హయాంలో పునాదు కూడా పడలేదని చెప్పారని, ఇప్పుడు మాత్రం టీడీపీ హయాంలోనే సగాని కంటే పైగా పూర్తయిందని రిపోర్ట్ ఇచ్చారని, అసత్యాలు పలికినందుకు ప్రజాకోర్టులో క్షమాపణలు ఎప్పుడు చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 60 పేజీలకు పైగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. హెడ్ వర్క్స్ 58 శాతానికి పైగా, కుడి ప్రధాన కాలువ 91 శాతానికి పైగా, ఎడమ ప్రధాన కాలువ దాదాపు 70 శాతం పూర్తయిందని పేర్కొంది. భూసేకరణ, సహాయ-పునరావాసం, ప్రాజెక్టు ఖర్చులు, పోలవరం తాజా పరిస్థితిపై పూర్తి వివరాలు సమర్పించింది. ఎన్నికలకు ముందు పోలవరం పునాదులు కూడా పడలేదని చెప్పిన జగన్ ఇప్పుడు 58 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడంతో టీడీపీకి దొరికిపోయారని అంటున్నారు. 

Read Also

ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న వైఎస్ షర్మిల
ఈ విజయ్... జగన్ కు ఎంత ఇష్టుడో తెలుసా?
చంద్రబాబు సరే.. ఇప్పుడు జగన్ సంగతేంటి మరి?