​అమరావతికి మద్దతు పలికిన తొలి హీరో

February 25, 2020

అమరావతి ఏమైతే మాకేంటి... మా కెరీర్ బాగుంటే చాలు మాకు అనుకుంటున్నారు తెలుగు సినిమా హీరోలు. అందుకే అక్కడ రాష్ట్రం రగిలిపోతున్నా... చరిత్రలో ఎన్నడూ తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకున్నా కూడా మారు మాట్లాడటం లేదు. ఈరోజు సినిమా బతికి బట్టకట్టింది... అంటే అందులో కృష్ణా, గుంటూరు జిల్లాల పాత్ర గణనీయంగా ఉంటుంది. తమను స్టార్లను చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆ జిల్లాలకు అన్యాయం జరుగుతుంటే... ఏ హీరో నోరు మెదపడం లేదు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించుకుపోతామని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తున్నా ఏ సినీ హీరో ఇంతవరకు దీనిపై స్సందించలేదు.

తొలిసారిగా... ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సినీ నటుడు నారా రోహిత్ తీవ్రంగా స్పందించారు.అమరావతి రైతుల పోరాటానికి హీరో, చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ మద్దతు తెలిపారు. 23 రోజులుగా వారు చేస్తోన్న న్యాయమైన పోరాటం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజధానికోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసిస్తూ ఫేస్ బుక్ లో సందేశాన్ని పెట్టారు. రైతులు పెద్ద మనసుతో భూములిచ్చారని.. వారి త్యాగంతోనే అమరావతి రాజధానిగా ప్రాణం పోసుకుందన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారిందన్నారు. ‘రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కవోని దీక్షతో రైతులు ముందడుగు వేస్తున్నారు. వారి పోరాటం వృథా కాదు. త్వరలోనే రైతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటాను’ అని రోహిత్ పేర్కొన్నారు.  ​