జ‌గ‌న్ మంద‌లించాడా అని ఆ ఎంపీని అడిగితే..

August 07, 2020

ఓవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వివిధ పార్టీల నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాయ‌కులు ప‌రుగులు పెడుతుంటే.. ఆ పార్టీ నుంచి ఓ ఎంపీ బ‌య‌టికి వెళ్ల‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ నాయ‌కుడు మ‌రెవ‌రో కాదు.. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు. జ‌గ‌న్ స‌ర్కారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లిష్ మీడియం నిర్ణ‌యాన్ని ఆయ‌న వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల తెలుగు భాషకు ఏర్ప‌డే ముప్పు గురించి ఆయ‌న గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఎంపీ వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్‌కు కోపం వ‌చ్చింద‌ని.. ఆయ‌న్ని గ‌ట్టిగా మంద‌లించార‌ని వార్త‌లొచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజ‌పా వైపు ర‌ఘురామ కృష్ణంరాజు చూస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా మాట్లాడారాని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
ఈ నేప‌థ్యంలో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిన ర‌ఘురామ‌కృష్ణంరాజు తాజాగా ఒక న్యూస్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ మీ ప‌ట్ల సీరియ‌స్ అయ్యార‌ట‌.. మిమ్మ‌ల్ని మంద‌లించార‌ట క‌దా అని అడిగితే.. త‌న‌ను తిట్టే అధికారం ఈ ప్ర‌పంచంలో ఎవ్వ‌రికీ లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ మీతో ఏం మాట్లాడారు అంటే.. అన్నీ చెప్పేస్తారా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. భాజ‌పా, జ‌న‌సేన మ‌ధ్య మైత్రి కోసం మీరు రాయ‌బారం న‌డుపుతున్నార‌ట క‌దా అని అడిగితే..ఆయ‌న స‌మాధానం దాట వేశారు. ప్ర‌ధాని మోడీతో ఇటీవ‌లి స‌మావేశం గురించి అడిగితే.. ఆయ‌న‌తో త‌న‌కు ఎప్ప‌ట్నుంచో స్నేహం ఉంద‌న్నారు. ప‌వ‌న్‌కు తాను అభిమానిన‌ని కూడా చెప్పారు. తెలుగు భాష‌కు అన్యాయం జ‌రిగితే మున్ముందు కూడా క‌చ్చితంగా పోరాడ‌తాన‌న్న ర‌ఘురామ‌.. ఆ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం మీద కేసులు పెడ‌తారా అని అడిగితే.. నూటికి నూరు శాతం పెడ‌తా అన‌డం గ‌మ‌నార్హం.