ఫ్లైట్ ఎక్కి పారిపోతున్న మిలియనీర్ ను పట్టుకున్నారు

May 26, 2020

వేలాది కోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాటిని తిరిగి క‌ట్ట‌కుండా విదేశాల‌కు పారిపోయే ఘ‌నుల ఉదంతాలు తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో నిఘా వైఫ్యలం మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విజ‌య్ మాల్యా.. నీర‌వ్ మోడీలు బ్యాంకుల‌కు పంగ‌నామం పెట్టి పారిపోయిన ఉదంతాల్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ తాజాగా మ‌రో కార్పొరేట్ దిగ్గ‌జం ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించి దొరికిపోయారు.
ఇటీవ‌ల మూత‌ప‌డ్డ జెట్ ఎయిర్ వేస్ మాజీ ఎండీ న‌రేశ్ గోయ‌ల్.. ఆయ‌న స‌తీమ‌ణి దుబాయ్ మీదుగా లండ‌న్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివ‌ర‌కు ముంబ‌యి విమానాశ్ర‌యంలో విమానం ఎక్కారు కూడా. ఇదే స‌మ‌యంలో కేంద్ర హోంశాఖ ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ర‌న్ వే మీద‌కు వెళ్లి విమానాన్ని ఆపేసి.. గోయ‌ల్ దంప‌తుల్ని విమానం నుంచి దించేశారు. గోయ‌ల్ దేశం విడిచి వెళ్లిపోతే రుణాలు వ‌సూలు చేసుకోలేమ‌ని అనుమానించిన బ్యాంకులు.. ఆర్థిక సంస్థ‌లు కేంద్రాన్ని ఆశ్ర‌యించాయి.
కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు హ‌డావుడిలో మోడీ ఉన్న‌ప్ప‌టికీ గ‌తంలో చోటు చేసుకున్న పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా హోంశాఖ అడ్డుకోవ‌టం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణాం అప్పులు తీసుకొని తిరిగి చెల్లించ‌కుండా ఉండే పెద్ద మ‌నుషుల వెన్నులో వ‌ణుకు పుట్టించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క‌తప్ప‌దు.