జగన్ ను జూనియర్ ఎన్టీఆర్ మామ ఎందుకు కలిసాడు ?

July 12, 2020

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచేసింది. గత ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన ఎన్నో వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్న ఆయన ఇతర పార్టీ నేతలపైనా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణ మోహన్, మేడా మల్లికార్జన రెడ్డి.. ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబులు రాజీనామా చేశారు. వీరిలో అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువ కప్పి ఆయనను వైఎస్‌ జగన్‌ వైసీపీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు జరుగుతున్న వలసలతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతుండగా, తాజాగా జరిగిన ఓ పరిణామం సంచలనంగా మారింది. ప్రముఖ నటుడు, దివంగత హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మామ.. వైసీపీ అధినేతతో భేటీ అయ్యారు.

సోమవారం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామ, నార్నే ఇండస్ట్రీస్ అధినేత నార్నే శ్రీనివాస రావు కలిశారు. వీరిద్దరూ సుమారు గంట సేపు చర్చలు జరిపారు. వీరి మధ్య ప్రస్తుత రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం నార్నే.. ‘‘ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. జగన్ నాకు బాగా సన్నిహితుడు. అందుకే ఆయనను కలవడానికి వచ్చాను. దీని వెనుక రాజకీయ కోణం లేదు’’ అని చెప్పారు. ఈ భేటీతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తననే చెప్పుకుంటూ ఉంటారు. తన తాత పెట్టిన పార్టీ అంటే తనకు గౌరవం ఉందని అంటుంటారు. అలాంటిది ఆయన మామ వైసీపీ అధినేతను కలవడం చర్చనీయాంశం అయింది. ఈయనే కాదు.. తారక్‌కు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకునే కొడాలి నాని కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడే సమయంలో ఎన్టీఆర్‌పై విమర్శలు వచ్చాయి. అలాగే హరికృష్ణ చనిపోయే ముందు రోజుల్లో ఆయన వైసీపీలో చేరబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇంతకీ నార్నే.. జగన్‌ను ఎందుకు కలిశారు..? ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా.? అనేది తెలియాల్సి ఉంది.