ఇన్నాళ్ల తర్వాత తెలుగు వాళ్ల కోరిక తీరింది

February 25, 2020

ప్రతిసారి రైతు వర్షాల కోసం ఎదురుచూసినట్టు తెలుగు ప్రేక్షకులు జాతీయ అవార్డుల కోసం ఎదురుచూడటం... అవి ఎవరో ఎగరేసుకుపోవడం... మనం నిరాశకు గురికావడం. ఇది జరుగుతూ వచ్చింది. 29 సంవత్సరాల తర్వాత ఆ ప్రహసనానికి బ్రేక్ వేసింది తెలుగు పరిశ్రమ. ప్రతి సారి పడిన అవమానాలు ఇక చాలంటూ... ఊపిరి పీల్చుకుని గట్టిగా ఈసారి అరిచి చెప్పింది టాలీవుడ్. ఈసారి ఏకంగా ఏడు అవార్డులు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ.
7 అవార్డులు ఒక విశేషం అయితే... తెలుగు సినిమా నటికి ఉత్తమ నటిగా (మహానటి సావిత్రి నటనకు) జాతీయ పురస్కారం దక్కడం ప్రధానమైన విషయం. కీర్తి సురేష్ మనమ్మాయి కాకపోయినా... అవార్డు దక్కింది మాత్రం తెలుగు సినిమా పాత్రకే. ఇటీవలే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా... ‘మహానటి’తో నిజంగా తన అందరి మనసులు దోచేసింది కీర్తి సురేష్. ఆమె నుంచి ఆ స్థాయి నటన రాబట్టిన ఘనత మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ దే.

ఒక తెలుగు సినిమా నటికి 1990లో చివరి సారిగా జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. అది ‘కర్తవ్యం’ సినిమాకు గాను విజయశాంతి జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇపుడు ఆ అవార్డు మనకు దక్కింది. సౌందర్యను ఆ అదృష్టం వరిస్తుందని చాలామంది భావించినా అది నెరవేరలేదు. ఇటీవల హీరోయిన్లు మరీ గ్లామర్ పాత్రలకే పరిమితం కావడంతో ఆ ఆశ కూడా కోల్పోయాం. అలాంటి సమయంలో వచ్చిన మహానటి... ఇంకా తెలుగు సినిమాలో ఫిమేల్ పాత్రకు కీలక స్థానముంది అని నిరూపించింది.
విజయశాంతి కంటే ఇద్దరు నటీ మణులు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఊర్వశి శారద (1978- ‘నిమజ్జనం’), అర్చన (1988-‘దాసి’). శ్రీదేవి, లక్ష్మి, సుహాసినిలకు కూడా జాతీయ అవార్డులు వచ్చినా... ఇతర భాషల సినిమాలు ఆ అవార్డులు వచ్చాయి.