జాతీయ స్థాయిలో బజారున పడుతున్న జగన్ పరువు

July 08, 2020

ఏపీ సీఎం జగన్ పాలనపై ఆ పార్టీ నేతలు అహో ఒహో అంటూ కీర్తనలు వినిపిస్తున్నా జాతీయ స్థాయిలో మాత్రం తీవ్ర వ్యతిరేక ముద్ర పడుతోంది. ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో చాలావర్గాలను ఆకట్టుకుంటే ఆకట్టుకోవచ్చు కానీ ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రగతి ప్రక్రియలు మాత్రం విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి వైపు అంతా పరుగులు తీస్తున్న దశలో అమరావతి ప్రాజెక్టును అతీగతీ లేకుండా చేయడం.. రివర్స్ టెండరింగ్ పేరుతో కంపెనీలను కంగారు పెట్టడం వంటి చర్యలు పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలనే కాదు ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో అవకతవకలు జరిగితే వాటిని సవరించాలే కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న మాట వినిపిస్తోంది.
జగన్ ప్రభుత్వ విధానాలపై నేషనల్ మీడియాలో వ్యతిరేక కథనాలు వరుసగా వస్తున్నాయి. గతంలో ఏసియన్ ఏజ్ , ట్రిబ్యూన్ వంటి పత్రికల్లో సంపాదకీయ పేజీల్లో వ్యాసాలు రాగా తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనమిక్ టైమ్స్ వంటి పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. పవన్ కల్యాణ్, చంద్రబాబులు ఈ రోజు ఆ కథనాలు ట్వీట్ చేయడంతో ఇంతవరకు వాటిని చూడనివారికీ అవి చేరాయి.
రెండు మూడు రోజుల కిందట బ్రూకింగ్స్ ఇండియా డైరెక్టర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్, ఆర్థికవేత్త అయిన శమికా రవి కూడా ఇటీవల ఇలాంటి ఒక కథనాన్ని ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును మంటగలిపినట్లుగా బిజినెస్ స్టాండర్డ్‌లో వచ్చిన కథనాన్ని శమిక షేర్ చేస్తూ ‘‘ఇమేజిన్, వాట్ దిస్ విల్ డూ క్రెడిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్(విచ్ ఈజ్ ఆల్రెడీ పూర్) ఇన్ ఇండియా’ అంటూ సూటిగా వ్యాఖ్యానించారు. 

Read Also

వైసీపీలో వల్లభనేని వర్సెస్ దేవినేని?
జ‌గ‌న్ నీతి వాక్యాలకు శుభం కార్డు పడింది
కూడుపెట్టేది నైపుణ్యమే...ఇంగ్లీషు కాదు...