నవనీత కృష్ణ సేవలు మరువలేం - బుచ్చిరాంప్రసాద్

August 07, 2020

తానా మాజీ అధ్యక్షుడు, టీడీపీ నేత డాక్టర్‌ గొర్రెపాటి నవనీత కృష్ణ (73) క‌న్నుమూశారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించి జన్మభూమి అభివృద్ధి కోసం అశిశ్రాంతంగా కృషి చేశారు. న‌వ‌నీత కృష్ణ మృతి ప‌ట్ల ఎన్నారై టీడీపీ నేత బుచ్చిరాం ప్ర‌సాద్ ప్రగాడ సంతాపం తెలిపారు. డాక్టర్‌గా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడిగా నవనీత కృష్ణ విశేష సేవలందించారన్నారు. డాక్టర్ నవనీతకృష్ణ తాను సంపాదించిన దానిలో అధిక మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చించి ప్రజాసేవ చేశార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన నవనీత కృష్ణ.. పార్టీ కార్యక్రమాల పట్ల అంకితభావంతో పనిచేశారు. న‌వ‌నీత కృష్ణ మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న‌ జీవితం అందరికి ఆదర్శప్రాయం అన్నారు. అలాంటి వ్యక్తి మృతి తెలుగుదేశం పార్టీతో పాటు యావత్‌ తెలుగు ప్రజానీకానికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తానా అభివృద్ధికి డాక్టర్ నవనీతకృష్ణ ఎనలేని సేవలు అందించారు. 2001లో తానా కోశాధికారిగా, అనంతరం ఉపాధ్యక్షుడిగా పదవులు నిర్వహించారని బుచ్చిరాంప్ర‌సాద్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. 2003-05 మధ్యకాలంలో తానా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయ‌న‌ డాక్టర్ నవనీతకృష్ణ 2005జూలైలో డెట్రాయిట్లో తానా ఉత్సవాలు అంగరంగ వైభవంగా  నిర్వహించార‌ని కొనియాడారు. 2007వ సంవత్సరంలో చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఆక్కడి ప్రవాసాంధ్రుల నుండి కోట్లాది రూపాయలు విరాళంగా ఇప్పించారని తెలిపారు.