వైసీపీ దారుణం - చెలరేగిపోయిన చంద్రబాబు

August 14, 2020

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. నానాటికీ ప్రభుత్వ పనితీరు దిగజారిపోవడమే కాకుండా ప్రజలను అభివృద్ధి చేయడం మరిచి వారికి ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం క్రూర చర్యల వల్ల  నెల్లూరు జిల్లాలోని వెంకన్నపాలెంకు చెందిన దళిత రైతు వెంకటయ్య విషం తాగిచనిపోయాడని, ఇది ప్రభుత్వ హత్య అని చంద్రబాబు ఆరోపించారు. 

వెంకన్నపాలెం పరిధిలోని సర్వే నెం. 131 లో ఉన్న తన భూమిని ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు రైతును వేధించడం, తీవ్రంగా అవమానించడంతో పాటు... పొలం పనులు చేసుకోకుండా అడ్డుపడ్డారని అవమానంగా భావించిన అతను పంట కోసం తెచ్చిన పురుగుమందులను అక్కడికక్కడే తాగి చనిపోయాడని ఆరోపిస్తూ చంద్రబాబు ఆ వీడియోను షేర్ చేశారు.

కోర్టుకు వెళ్లి తన భూమిని కాపాడుకున్నా అధికారులు ప్రతీకారం తీర్చుకోవడం ఏపీలో ఉన్న భయంకరం వాతావరణాన్ని చూపిస్తోందని చంద్రబాబు ఎత్తిచూపారు. ఏపీ అధికారులు గౌరవనీయ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా, రైతును శారీరక, మానసిక హింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ ఘటనలో కేవలం అతనిపై మానసిక, శారీరక దాడి చేయడమే కాకుండా రైతుల మానవ హక్కులను అధికారులు ఉల్లంఘించారని చంద్రబాబు అన్నారు. 

పోలీసులు అక్కడే ఉన్నా... వారి కళ్లముందే అతను పురుగులు మందు తాగిచనిపోతున్నా అతన్ని ఆసుపత్రికి తరలించడానికి బదులుగా పోలీసులు ప్రేక్షకులుగా మిగిలిపోవడం దారుణం అన్నారు.

ఈ విచారకరమైన సంఘటనను వదిలిపెట్టమని, రైతు వెంకటయ్య కుటుంబానికి అండగా నిలబడతాం అని, తప్పు చేసిన అధికారులకు తప్పకుండా శిక్ష పడేవరకు వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వపు ఈ అమానవీయ చర్యలను పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.