అమ్మ ఒడి పథకంపై నెటిజన్ లేఖ వైరల్

August 14, 2020

ఆరోజు ఫీజు రీఎంబర్స్ మెంట్ అయినా, నేటి అమ్మ ఒడి పథకం అయినా... రెండూ మంచివే. కానీ వాటిని ప్రవేశపెట్టిన నాయకుల ఉద్దేశాలపైనే అనుమానాలు. ప్రజలకు ఫ్రీగా ఇవ్వడం కాదు... సమాజానికి వసతులు కల్పించడం. రెండూ వేరు. అంటే ప్రభుత్వ పథకం ఉచితమే కావచ్చు గాని అది అర్హుడికి అందడం కూడా అత్యవసరం. ఆరోజు వైఎస్, ఈరోజు జగన్ వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని రెండు పథకాలను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే... అమ్మఒడిని ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేయడమే దీనికి కారణం. ఈ పథకం పై ఒక నెటిజన్ రాసిన అభిప్రాయం... అందరినీ ఆకట్టుకుంటోంది. దానిని యథాతథంగా కింద ప్రచురిస్తున్నాం.


స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు గల చిరాకుకీ ఒక కారణం ఫీజ్ రీయంబర్స్మెంట్

దీని మూలాన
- ఉన్నతవిద్య ప్రమాణాలు తగ్గిపోయాయి
- పుట్టకొక్కుల్లా ప్రయివేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి
- ప్రభుత్వ సొమ్ము ఫీజ్ రీయంబర్స్మెంట్ రూపంలో తమ అనుయాయులు, అనుచరులు, బినామీల కాలేజీలకు మళ్లింపు.
నిజమే ఈ పథకం వల్ల చాలా మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉండొచ్చు కానీ ఎంతమంది చక్కటి భవిష్యత్తును పొందారు?? రానురాను అసలు ఇంజనీరింగ్ విద్యకు విలువ లేకుండా పోయింది. ఉద్యోగావకాశాలు అసలే లేవు.
దాని బదులు ఆ రోజే ఆ నిధులతో ప్రభుత్వ కాలేజీలు ఇంకొన్ని కట్టించి, అదివరకే ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు సంఖ్య పెంచి, విద్యా ప్రమాణాలు మెరుగు పరిచి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో! ​
ఈ రోజున వందల కాలేజీలు కేవలం ఫీజ్ రీయంబర్స్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు కోసం ఎలాగోలా కొంత మంది స్టూడెంట్స్ ని తీసుకొచ్చి తమ కాలేజీల్లో జాయిన్ చేసుకుంటున్నారు​.
​ఈ​ విషయం పథకం పెట్టిన వాళ్ళకి​ తెలిసుండదా అంటే...ఎందుకు తెలీదు?
లాభ నస్టాలు బేరీజు వేసుకునే కదా సాంప్రదాయ రాజకీయ వాదులు ఈ పథకాలు ప్రవేశ పెట్టేది.
మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిని అవలంభించి అమ్మ ఒడి అంటూ మళ్లీ ప్రయివేటు స్కూల్స్ ని ప్రోత్సహిస్తే ఇక అంతే. అసలు నాకు అర్ధం కాని విషయం ఏంటంటే బడికి పంపిస్తే డబ్బులు ఇచ్చుడు ఎందుకు??
మీరు ఎలాగూ గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నారు, వారికే ఈ బాధ్యత అప్పజెప్పి బాలకార్మికులను గుర్తించి వారి కుటుంబాలకు ఆ డబ్బులు అందజేసి మిగతా వాళ్లకు డబ్బులిచ్చే బదులు అవే నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరచండి, అలాగే పట్టణాల్లో మొట్ట మొదట రాజకీయ నాయకుల ఇళ్ళల్లో మరియు వ్యాపారవేత్తల ఇళ్ళల్లో తనిఖీలు చెయ్యండి బాలకార్మికులు చాలా మంది ఉంటారు.
అలా చిన్న పిల్లలతో పని చేయించుకునే వారి మీద కేసులు పెట్టి బొక్కలో తొయ్యండి. ఆ పిల్లల కుటుంబాలకు అమ్మఒడి ని అందివ్వండి. పట్టణాల్లో ఎంతోమంది మన కళ్ళకి కనిపిస్తూనే ఉంటారు చిన్న పిల్లలు గుడారాల్లో, మురికి వాడల్లో, ఫ్లై ఓవర్లు కింద మరి వాళ్ళకి ఈ అమ్మ ఒడి సక్రమంగా అందుతుందా అంటే ఎన్నో అనుమానాలు.
వాళ్ళ కోసం కూడా విధి విధానాలు రూపొందించండి...వారికి కూడా నాణ్యమైన విద్యను అందించండి. ఇదంతా సాధ్యం కాదని చెప్పకండి...ఖచ్చితంగా సాధ్యపడుతుంది మీకు చెయ్యాలనే తలంపు, ధృడ సంకల్పం ఉంటే! అయినా మీరు డబ్బులు ఇచ్చేది మళ్లీ ఓట్లు వెయ్యాలనే కదా, దాని బదులు అదే పనిని సక్రమంగా చెయ్యండి, ఖచ్చితంగా వేస్తారుగా ఓట్లు ఇష్టం వచ్చినట్లు డబ్బు పంచకండి సార్, సక్రమంగా వినియోగించండి​.

​- విశ్వ నరుడు