అత‌ను హ‌త్య చేస్తే ద‌ర్శ‌కుడిని నిందించ‌డ‌మా?

May 29, 2020

అర్జున్ రెడ్డి సినిమా స‌మ‌యంలో ఎన్ని వివాదాలు త‌లెత్తాయో తెలిసిందే. ఈ చిత్రంలో ముద్దు స‌న్నివేశాల మీద తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌లు కూడా జ‌రిగాయి. అయితే ముద్దు కంటే హ‌త్య చాలా ప్ర‌మాద‌క‌రం అయింద‌ని.. ముద్దు అనేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉండే మంచి విష‌యం అని.. సినిమాల్లో ఎన్నో హ‌త్య‌లు చూపిస్తే లేని అభ్యంత‌రం ముద్దు స‌న్నివేశాలు చూపిస్తే ఎందుకొస్తుంద‌ని లాజిక్‌తో మాట్లాడాడు ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజ‌య్. క‌ట్ చేస్తే ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన టిక్ టాక్ స్టార్ అశ్వ‌నీకుమార్ త‌నను ప్రేమించ‌లేద‌న్న కార‌ణంతో ఓ అమ్మాయిని హ‌త్య చేస్తే అందుకు అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ స్ఫూర్తిగా నిలిచిందంటూ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌ను నిందిస్తుండ‌టం విడ్డూరం.
అశ్వ‌నీకుమార్ క‌బీర్ సింగ్ సినిమాలోని డైలాగుల‌తో టిక్ టాక్ వీడియోలు చూశాడ‌ట‌. త‌న‌కు ద‌క్క‌ని అమ్మాయి ఎవ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌ని స్టేట్మెంట్లు ఇచ్చాడ‌ట‌. అత‌ను ఆ అమ్మాయిని హ‌త్య చేయ‌డానికి క‌బీర్ సింగే ఒక ర‌కంగా కార‌ణ‌మైంద‌ని పోలీసులు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఇప్ప‌టికే క‌బీర్ సింగ్ సినిమా గురించి ఎంతో వ్య‌తిరేక ప్ర‌చారం చేసిన బాలీవుడ్ మీడియాకు ఇదే అదున‌ని రెచ్చిపోతోంది. మ‌రి హిందీలో హింసాత్మ‌క‌మైన సినిమాలు ఎన్నో వ‌స్తున్నాయి. అవి కాక అస‌లు హింసే లేకుండా క‌బీర్ సింగ్ అనే విఫ‌ల ప్రేమికుడి క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా హ‌త్య‌కు స్ఫూర్తిగా నిలిచింద‌న‌డం ఎంత వ‌ర‌కు న్యాయం? ఇలా అయితే ప్ర‌తి సినిమా విష‌యంలోనూ అభ్యంత‌రం వ్య‌క్తం చేయొచ్చు. దీనిపై సందీప్ స్పందిస్తూ.. జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశాడు. తాను త‌న సినిమాలో హ‌త్య‌లు చూపించ‌లేద‌ని, హ‌త్య‌లు చేయ‌మ‌ని కూడా చెప్ప‌లేద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.