‘‘జగన్ ఎదురు ప్రశ్నలు వేయొద్దు‘‘

August 05, 2020

కేంద్రం తెచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రిని తీవ్రంగా హర్ట్ చేసింది. ఆయనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎలాగైనా తెలుగు నేలపై ఆంగ్ల భాషను రుద్దడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న జగన్ రెడ్డికి కేంద్రం తాజా నిర్ణయం భారీ దెబ్బ వేసింది.

ప్రాథమిక విద్య కేవలం మాతృభాషలో మాత్రమే సాగాలని నిర్దేశించింది.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన తీరు మార్చుకోవాలని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.  

ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు కేంద్రం తెచ్చిన కొత్త విద్య విధానంపై మాట్లాడుతూ...  మాతృ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ప్రముఖులు అందరూ భావిస్తున్నారు.

దాని ప్రధాన ఉద్దేశాన్ని జగన్ అర్థం చేసుకోకుండా ‘‘వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?‘‘ అని జగన్‌ ఎదురు ప్రశ్నలు వేయడం  ఏ మాత్రం సబబు కాదని రఘురామకృష్ణంరాజు తప్పుపట్టారు. 

భారతదేశానికి మార్గద్శకుడిగా నిలిచిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం ప్రాథమిక విద్యను తెలుగు మీడియంలో  చదువుకునే అంత గొప్పవారు అయ్యారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

ఆయన తెలుగులో అనేక పుస్తకాలు రాశారని, తెలుగు అకాడమీని నెలకొల్పిందే ఆయన అన్నారు.

ఇలా మాతృభాషలో చదువుకుని గొప్ప వారు అయిన వారు మన కళ్లముందే ఉన్నారని రఘురామరాజు జగన్ కి హితవు పలికారు.

ఊరందరిదీ ఒక దారి, నాది ఒకదారి అన్నట్టు జగన్ వ్యవహరిస్తున్న ధోరణి ఏమాత్రం సరైనది కాదన్నారు. 

మాతృభాషలో విద్యాబోధన చాలా అవసరం అని, అలా జరిగినపుడే మన భాష, సంస్కృతికి రక్షణ లభిస్తుందన్నారు.

అందుకే ఇంగ్లిష్ మీడియం ప్రతిపాదనను ఆయన వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు.