మన కొత్త గవర్నర్ ఎవరో తెలుసా?

July 09, 2020

అదేంటి గవర్నర్ ని మార్చారా? అని ఆశ్చర్యపోకండి. ఇంకా మార్చలేదు. మార్చే పనిలో ఉన్నారు. తెలుగు వాళ్లు విపరీతంగా బోర్ కొట్టిన గవర్నర్ నరసింహన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి ఇక్కడే రెన్యువల్ చేసే అవకాశం లేదు. అందుకే కొత్త గవర్నర్ ని ఏపీకి తెస్తున్నారు. ఆ పేర్లలో ఫస్ట్ వినిపిస్తున్న పేరు సుష్మాస్వరాజ్ కావడం సంచలనం. గవర్నర్ ని మార్చడానికి కారణం అతను రెండు టెర్ములు ఉండటం మాత్రమే కాదు. 2024లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించే నరసింహన్ ను ఇక్కడ ఉంచడం శ్రేయస్కరం కాదన్నది మోడీ ఉద్దేశం. మరి ఇపుడు సరైన వ్యక్తి ఎవరు? అని వెతుకుతున్న బీజేపీకి కనిపించిన బ్రహ్మాండమైన ఆప్షన్ తెలంగాణ వాళ్లుగా చిన్నమ్మగా పిలుచుకునే సుష్మస్వరాజ్.

ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల ఆమె ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉన్నారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఐదేళ్ల మోదీ పాలనలో ఆమె సక్సెస్ ఫుల్ మంత్రి. విదేశీ సంబంధాలు, ప్రవాస భారతీయుల రక్షణ, ఐక్యరాజ్యసమితిలో భారత వాణి వినిపించడంలో చురుకైన తీరు వంటివి ఆమెను లీడర్ గా నిలబెట్టాయి. భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో ఆమె ఘనత ఉంది. బీజేపీకి అత్యంత నమ్మకస్తురాలైన సుష్మను ఇక్కడ గవర్నర్ గా పెట్టి కేసీఆర్ కి చుక్కలు చూపించాలనేది బీజేపీ ఆలోచన. అందులో భాగంగా సుష్మను ఇక్కడ పెడితే విభజనకు సానుకూల వ్యక్తిగా ఆమెపై ఉన్న సాఫ్ట్ భావన పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్ని బీజేపీ భావన.

సుష్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమిస్తారా? లేదా తెలంగాణకు మాత్రమే నియమిస్తారా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం అనధికారిక సమాచారమే ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్ లను ఏర్పాటుచేసే అవకాశమూ లేకపోలేదు.
సుష్మతో పాటు లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్‌, ఆనందిబెన్ కూడా రేసులో ఉన్నారు. అంటే ఒక్కరు పోయి ఇద్దరు వస్తారో లేదో తెలియదు గాని... నరసింహన్ పోవడం అయితే గ్యారంటీ.