ఏపీ ఎన్నికల కమిషనర్ గా మూడో కృష్ణుడు

August 15, 2020

ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజారోగ్యం కంటే కూడా రాజకీయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నపరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. ప్రభుత్వం అనుకున్న రీతిలో కాకుండా..స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయటం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ వెనక్కి తగ్గలేదు.

దీనికి ప్రతిగా ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసి.. రమేశ్ కుమార్ ను ఇంటికి పంపింది. దీంతో.. న్యాయపోరాటం షురూ అయ్యింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టటమే కాదు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్  ను నియమిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అప్పీలు కోసం సుప్రీంను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రమేశ్ కుమార్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. మాజీ జస్టిస్ కనగరాజ్ ను తెర మీదకు తీసుకొచ్చి.. ఎన్నికల కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. హైకోర్టు తాజా నిర్ణయంతో ఆయన పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో ఏపీ అధికార పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు జోరుగా వాదనలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇప్పుడో కొత్త సీన్ ఒకటి తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కోర్టు ఓకే చెప్పిన రమేశ్ కుమార్ ను ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. అదే సమయంలో ఏపీ సర్కారు నియమించే వ్యక్తిని కోర్టు ఓకే చెబుతుందా? అన్నది మరో ప్రశ్న. ఇలాంటివేళ.. మధ్యే మార్గంగా ఇప్పటికే ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్ స్థానంలో మరో కొత్త కృష్ణుడ్ని తీసుకురావటం ద్వారా.. ఈ ఇష్యూను క్లోజ్ చేయాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా రిటైర్డు ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను నియమించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అదే నిజమైతే.. ఏపీఎన్నికల కమిషన్  నియామకం విషయంలో సాగుతున్న లొల్లి మరో మలుపు తిరిగే వీలుందని చెబుతున్నారు. తాజా ఢిల్లీ టూర్ లో ప్రత్యేకంగా చర్చించే అంశాల్లో ఇదొకటన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరేం చేస్తారో చూడాలి.