ఆ పార్టీ నిర్ణయంతో టీడీపీ నేతలకు కొత్త టెన్షన్

May 30, 2020

కొద్దిరోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. టీఆర్ఎస్‌ను ఓడించడానికి ప్రజాకూటమి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు, ప్రభుత్వం వస్తే ఏం చేస్తామనేది చెప్పడంతో విఫలమైంది. అందుకే కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రజాకూటమి ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఈ ఎన్నికల తర్వాత కూడా ఈ పార్టీలన్నీ కలిసే ఉంటాయని అంతా భావించారు. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు సన్నద్ధం అవుతూ వచ్చాయి. పొత్తులపై చర్చలు కూడా జరపాలని భావించాయి. అయితే, ప్రజాకూటమి వల్ల కాంగ్రెస్ ఓటమి పాలయిందని కొందరు, దాని ప్రభావం లేదని మరికొందరు తమ తమ వాదనలు వినిపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది.

 

 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీలోని నేతలు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నట్లు అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఇటీవల రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ల వాదన విన్న రాహుల్ కూడా వారి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో తెలంగాణ నేతలు క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీఈసీ రూపొందించిన జాబితాను ప్రాథమికంగా ఏఐసీసీ స్ర్కీనింగ్‌ కమిటీ పరిశీలించింది. శివరాత్రి తర్వాత జాబితాపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి ఒకటి నుంచి మూడు పేర్ల వరకూ షార్ట్‌ లిస్టు చేసినట్లు తెలిసింది. దీంతో టీటీడీపీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తుండటంతో వారిలో కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. తెలంగాణలో పార్టీకి బలమున్న స్థానాల్లో పోటీ చేయాలని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.