Visakhapatnam : జగన్ కి నోటీసులు వచ్చాయి

June 02, 2020

Styrene (స్టైరీన్) గ్యాస్ లీకేజీ కారణంగా ఏ పాపమూ తెలియని  11 మంది తమ ప్రమేయం లేకుండా ప్రాణాలు విడిచారు. హృదయవిదారకరమైన దృశ్యాలతో వైజాగ్ శివార్లు ఎక్కడికక్కడ పడిపోయిన మృతదేహాలతో ప్రపంచానికే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సంఘటన జరిగిన కంపెనీలో గ్యాస్ లీక్ బెల్ మోగకపోవడం ప్రమాదం నుంచి కాపాడుకోలేకపోవడానికి మూలకారణం అయితే... అసలు జనావాసాల్లో ఉన్న ఆ కంపెనీకు ఇప్పటికపుడు అన్ స్కిల్డ్ స్టాఫ్ తో అనుమతి ఇవ్వడం వంటి ఎన్నో ఇంకా బయటకు రావాల్సి ఉన్న తప్పిదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.

ఈ ఘటనను సుమోటో గా స్వీకరించి మానవ హక్కుల కమిషన్ జగన్ సర్కారుకు, మోడీ సర్కారుకు నోటీసులు ఇచ్చింది. ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం. ఆ నిర్లక్ష్యం ఎవరిది అయినా కావచ్చు... కానీ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. వెంటనే దీనిపై స్పందించమని మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాలను కోరింది. అక్కడ ఏం జరింది? లీకేజీ ఎలా అయ్యింది? ప్రమాదం తీవ్రత? బాధితులకు ఇచ్చిన ట్రీట్ మెంట్, గ్యాస్ లీక్ ప్రభావం పడిన LG polymers india ltd పరిసర ప్రాంతాల కుటుంబాల కోసం తీసుకున్న చర్యలు వంటివన్నిటిపై కూలంకుషంగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ జగన్ సర్కారును ఆదేశించింది. 

ఏపీ ప్రధానకార్యదర్శి నీలంసహానీ పేరు మీదు జగన్ సర్కారుకు ఈ నోటీసులు అందాయి. అలాగే డీజీపీ గౌతం సవాంగ్ కి కూడా దర్యాప్తు నివేదిక సమర్పించాలని నోటీసులు ఇచ్చింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు కూడా నోటీసులు పంపిన మానవహక్కుల కమిషన్ (NHRC) అసలు ఆ కంపెనీ పరిస్థితి, ప్రమాణాలు పాటిస్తోందా లేదా? అనేది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అందరూ నాలుగు నెలల్లోపు నోటీసులకు పూర్తి సమాచారంతో స్పందించాలని (NHRC) ఆదేశించింది.