కోడికత్తి కేసులో జగన్‌కు ఎన్ఐఏ షాక్

October 16, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి కేసు సంచలనమైన విషయం తెలిసిందే. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని హైదారాబాద్ వెళ్లడానికి విశాఖపట్నం విమానాశ్రయం చేరకున్న జగన్‌పై ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో కుక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి రాస్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నేతకు సంబంధించిన కేసు కావడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. అంతేకాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండడంతో నిక్కచ్చిగా వ్యవహరించాలని ముందుగానే చర్యలు తీసుకుంది. అందుకోసం విశాఖ నార్త్‌ ఏసీపీ బీవీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై కొన్ని రోజులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఆ బృందం అధికారులు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దర్యాప్తులో తేలిన విషయాలపై నివేదికను తయారు చేసి, మీడియాకు వెల్లడించారు. దాడి వెనుక కుట్ర కోణం లేదని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా స్పష్టం చేశారు.

 

కేవలం సంచలనం సృష్టించి ప్రజల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతోనే జానిపల్లి శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేశాడని ఆయన వివరించారు. దీనిపై నమ్మకం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై జరిగిన దాడి కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో కోర్టు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. అప్పటి నుంచి ఎన్ఐఏ అధికారులు రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఈ కేసు విషయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడు శ్రీనివాసరావును కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకుని ప్రత్యేకంగా విచారణ జరిపారు. ఆ సమయంలో ఎన్ఐఏ విచారణ ఎలా సాగుతోంది..? అసలు ఎన్ఐఏ విచారణలో ఏ విషయాలు వెలుగు చేశాయి..? అనే సందేహాలు కలిగాయి. అయితే, ఈ కేసు విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ జగన్‌కు షాక్ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. కేసుపై పూర్తిగా విచారణ జరిపిన అధికారులు ఇప్పటికే నివేదిక తయారు చేశారని సమాచారం. ఇందులో ఏపీ పోలీసులు వెల్లడించిన అంశాలనే ప్రస్తావించారని తెలిసింది. సిట్ ఇచ్చిన నివేదిక మాదిరిగానే ఎన్ఐఏ బృందం కూడా దాడి వెనుక కుట్ర కోణం లేదని తేల్చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ అధినేతకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుందనడంలో సందేహం లేదు.