చేయకూడని పని చేసిన మాజీ సీఎం... కేసు బుక్

August 08, 2020

నిబంధనలు ఉల్లంఘించడమే తమ పరపతికి నిదర్శనంగా భావిస్తుంటారు భారత రాజకీయ నాయకులు. దేశమంతటా ఇదే పరిస్థితి. రాజకీయ నాయకులే కాదు... చాలా మంది ఉన్నతాధికారులది కూడా ఇదే బాపతు. దేశంలో కరోనా ప్రభావం తెలుసు. తనకు ట్రావెల్ హిస్టరీ ఉన్న విషయం తెలుసు... అయినా కనికా కపూర్ పార్టీ ఇవ్వడం, దానికి బాధ్యతారాహిత్యంగా రాజకీయ ప్రముఖులు హాజరుకావడం దేశంలో ఎంతో కలకలం రేపింది. మొన్నామధ్య కొత్తగూడెం డీఎస్పీ... కొడుకుని క్వారంటైన్లో ఉండమని సూచించినా కూడా తన అధికార పరిధిని వాడి ఫంక్షను చేసి అందరికి తలనెప్పులు తెచ్చాడు. తర్వాత తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి... లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు.  బాధ్యతుండక్కర్లా.... అంటూ ​కుమారస్వామిపై ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు కేసు కూడా  బుక్​ చేశారు. 

ఇంతకీ కుమార స్వామి ఏం చేశాడు అంత పెద్ద తప్పు అనుకుంటున్నారు. ఏకంగా కొడుకు నిఖిల్ గౌడ పెళ్లి చేశాడు. బెంగళూరులోని రామ్ నగర్ పరిధిలోని కేతగానహళ్లిలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో నిఖిల్ గౌడకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతికి వివాహం జరిపించారు. ఇది బాగా వైరల్ అవడంతో ప్రజల నుంచి విమర్శలు వస్తాయని భావించిన ముఖ్యమంత్రి దీనిపై విచారణకు ఆదేశించారు. 

ఈ గొడవపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ మాట్లాడుతూ ఈ పెళ్లిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే వ్యవస్థను వెక్కిరించినట్లవుతుంది, ప్రజలను అవమానించినట్లు అవుతుందని అని వ్యాఖ్యానించారు. రామ్ నగర కమిషనర్ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిపించిన తండ్రి కుమారస్వామిపై కేసు బుక్ చేసినట్లు తెలుస్తోంది. అంత పెద్ద హోదాలు నిర్వహించిన వారు ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా వ్యవవహరిస్తారో అంటూ జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.