బ్రేకింగ్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని

December 14, 2019

ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం (బుధవారం రాత్రి పది గంటల అనంతరం) జీవో జారీ చేసింది. గురువారం నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం కార్యదర్శి నియామకానికి సంబంధించి జీవో నం.2563 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది.

ఎవరీ నీలం సాహ్ని?

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపవర్ మెంట్  కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్ గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. అనంతరం ఇక్కడే ఉన్నత పదవులకు వెళ్లారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీ శిశు సంక్షేమశాఖ పి.డి.గా పనిచేశారు. ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలెక్టర్ గా చేశారు. కుటుంబ సంక్షేమశాఖకు కొంత కాలం కమీషనర్ గా చేశారు.  

కొన్నేళ్ల క్రితం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అక్కడి నుంచి ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి మళ్లీ కేంద్రానికి వెళ్లారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సతీనాయర్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాగా, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని.