నిమ్మగడ్డ ...ఒక పదవి, అనేక ట్విస్టులు

August 05, 2020

పాలకులకు ఇగో వల్ల రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొంటుందో చెప్పడానికి నిమ్మగడ్డ ఎపిసోడ్ చక్కటి తాజా ఉదాహరణ

ఎన్నికల వాయిదాతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వచ్చేదీ లేదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి పోయేదీ లేదు

కానీ తప్పు చేయకుండా నన్నెందుకు తొలగిస్తావని ఆయన, నన్నడగకుండా ఎన్నికలెలా వాయిదా వేస్తావని ఈయన 

ఇద్దరు కలిసి మీడియాకు మంచి పోషకాహారాం అందించారు. 

కరోనా సంక్షోభం అన్నిచోట్ల ా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలను సృష్టిస్తే ఏపీలో వాటితో పాటు రాజ్యాంగ సంక్షోభాన్ని కూడా సృష్టించింది. 

గవర్నరు, హైకోర్టు, సుప్రీంకోర్టు, మంత్రి మండలి, కార్యనిర్వాహక వ్యవస్థ అందరూ దీనిలో భాగస్వాములు కావల్సి వచ్చింది. తానొకటే పక్కనెందుకు ఉంటాను అంటూ తనంతట తానే శాసన సభ స్పీకరు తమ్మినేని సీతారాం కూడా దీనిపై స్పందించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా గవర్నరును కలిసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు సూచన మేరకు గవర్నరు బిశ్వభూషణ్ హరించదన్ ను కలిశారు. తనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని గవర్నరును కోరారు. గవర్నర్ తన వినతిపై సానుకూలంగా స్పందించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

ఇది పక్కన పెడితే ఎపుడు ఏం జరిగిందో చూద్దామా?

 • స్థానిక ఎన్నికలు నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అయితే ఎన్నికలు నిర్వహించేంది మాత్రం ఎన్నికల కమిషనే. రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది.
  దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడం మొదలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
 • వెంటనే ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షనేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కాబట్టే ఆయన చెబితే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
 • తర్వాత టీడీపీ కోసమే నిమ్మగడ్డ  రమేష్ కుమార్ ఇలా చేశారంటూ మంత్రులు, వైకాపా నేతలు ఆరోపణలు చేశారు. 
 • అనంతరం తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... భద్రత లేదని, కేంద్ర బలగాల రక్షణ కోరుతూ మార్చి 18న ఎన్నికల కమిషనర్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.
 • అనంతరం ఏపీ సర్కారు ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది.
 • ఆ ఆర్డినెన్స్ అమలుతో ఆటోమేటిగ్గా నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిపోయింది.‌
 • దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. 
 • సుధీర్ఘ విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పుఇచ్చింది. 
 • హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును స్వాగతించింది. 
 • అయినా నిమ్మగడ్డకు పదవి అప్పగించలేదు
 • దీంతో నిమ్మగడ్డ కోర్టు దిక్కరణ కింద హైకోర్టుకు వెళ్లారు.  
 • హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 • గవర్నర్‌ ను కలిసి వినతి పత్రం ఇమ్మని నిమ్మగడ్డను ఆదేశించింది.
 • ఇంతలో ఏపీ సర్కారు హైకోర్టు తాజా తీర్పుపై స్టే కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఇక్కింది... ఆ విచారణ జరుగుతోంది.