నిమ్మగడ్డ ఇష్యూ - ఏపీ సర్కార్ షాకింగ్ కామెంట్స్

August 13, 2020

హైకోర్టు ఆదేశాలతో తన నియామకం కోరుతూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన విషయం తెలిసిందే. దానిపై ఏపీ గవర్నర్ వేగంగా స్పందించారు. ఏపీ సర్కారుకు షాక్ ఇస్తూ... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఏపీ సర్కారుకు లేఖ రాశారు. దీంతో అందరూ ఆయన నియామకం వెంటనే జరిగిపోతుందనుకున్నారు. కానీ ఏపీ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఆదేశాలను కూడా ఏమాత్రం పాటించడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాటలే దీనికి తాజా ఉదాహరణ.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. ప్రభుత్వం పట్టుదల ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నా...  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని ఆయన వైపు వేలెత్తి చూపుతు  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. 

రాజ్యాంగ పదవిలో ఉండాలని కోరుకుంటూనే హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. బహిరంగంగా ఒక ప్రముఖ హోటల్లో కలవడం రహస్య మంతనాలు ఎలా అవుతాయో, ఏ పదవిలో ఉన్నా తెలిసిన వారిని కలవడానికి ఏ నిబంధనలు అడ్డురావని ఎందుకు శ్రీకాంత్ రెడ్డికి అర్థం కావడం లేదో తెలియడం లేదు.

ఆయన ఇంకో విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా ? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మాటల్లో ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే... రాజ్యాంగపదవి నుంచి తొలగించిన నిమ్మగడ్డను మళ్లీ ఆ పదవిలో కూర్చోమని గవర్నరు ఆదేశాలిచ్చారని ఒకవైపు చెబుతూనే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అనడంలో ఆంతర్యం ఏంటి? కన్ఫ్యూజన్లో కూడా క్రియేటివిటీనా, లేదా అజ్జానమా? 

శ్రీకాంత్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నారు...  రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని ఆరోపించారు.  అసలు రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టు, సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం నా పదవిని తొలగించే హక్కులేదని ఆయన కోర్టుకు వెళ్లి .... ఏపీ సర్కారు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించిన తీరును బయట్టబయలు చేస్తే.... తిరిగి శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్ స్థానంలో ఉండి.... రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టు నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని ఆరోపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఆయన ఇంకో ఆణిముత్యం కూడా వదిలారు. రూ. కోట్లు ఖర్చు చేస్తూ నిమ్మగడ్డ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు.  అసలు కోర్టుల్లో కేసులు వేయడానికి కోట్లు ఎందుకు ఖర్చవుతాయి? ఒకవేళ అదేనిజమనుకుంటే రంగులు, నిమ్మగడ్డ విషయంలో ఎందుకు ప్రభుత్వం అన్ని కోట్లు ఖర్చు పెట్టి భేషజాలకోసం ప్రభుత్వం వృథా చేసింది?