నిమ్మగడ్డ గెలిచాడు - జగన్ ఓడాడు 

August 07, 2020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు లో ఏపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలింది. హైకోర్టు కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీం కోర్టు కి వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంచీవాట్లు పెట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరిన ఏపీ ప్రభుత్వానికి స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  ‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుకు సంబంధించి ప్రతి విషయం మా దృష్టికి వచ్చింది. మేం కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వకుండా నిరాకరించాం. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ లేఖ పంపినా రమేశ్ కుమార్‌కు తిరిగి పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయం’ అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఏపీకి సాంత్వన లభించకపోగా... సుప్రీంకోర్టుకు పోయి కొత్త తలనొప్పి తెచ్చుకున్నట్లయ్యింది.

ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  రాష్ట్రంలో ఏం జరుగుతోందని పలుమార్లు వ్యాఖ్యానించిన సుప్రీం - గవర్నర్ ఆదేశాలిచ్చినా ఎందుకు అమలు చేయడం ప్రశ్నించింది. గవర్నర్ సలహాలివ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీసింది.