సంచలన నిర్ణయం తీసుకున్న నిమ్మగడ్డ

August 07, 2020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి నుంచి నిత్యం ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఏపీ రాజకీయాలు మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. చివరకు ఆయన తన మిత్రుడు సుజన చౌదరిని కలవడాన్ని కూడా కొన్ని పార్టీలు రాజకీయం చేశాయి. ఈ వివాదాస్పదన సమయంలో తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి కనగరాజ్ ను ఎస్ఈసీ గా చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషను వేశాయి. హైకోర్టు తీర్పు పై వారు స్టే కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. కేవలం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషను వేశారు. సుప్రీం కోర్టులో పిటిషను విచారణలో ఉండగా నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం అయ్యింది. తాజా పిటిషనులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం కోర్టు దిక్కరణకు పాల్పడుతోందని తెలిపారు. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

తాజా పిటిషనులో ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శులను, పంచాయతీ రాజ్ కార్యదర్శిని నిమ్మగడ్డ ప్రతివాదులుగా పేర్కొన్నారు.