నిమ్మగడ్డ నియామకం ప్రజాస్వామ్య ఓటమే: శ్రీకాంత్ రెడ్డి

August 14, 2020

ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఏపీ ఎస్ ఈసీ పదవీ కాలాన్ని సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం మొదలు....తాజాగా నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని ప్రభుత్వానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లేఖ రాయడం వరకు ఈ వ్యవహారం పలు మలుపులు తిరిగింది.

ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిమ్మగడ్డ వ్యవహారంలో తాము ఓడిపోలేదని...కొందరు ఈ వ్యవహారంలో కుట్రపూరితంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఓడించారంటూ వ్యాఖ్యానించారు.

గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదన్న వాదన సరికాదని, గవర్నర్ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని నిమ్మగడ్డ గౌరవించాలని శ్రీకాంత్ అన్నారు.

నిమ్మగడ్డకు రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలపై గౌరవం లేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని మాత్రమే తాము చెప్పినట్లు శ్రీకాంత్ అన్నారు.

గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని, గతంలో ఎస్ఈసీగా కనగరాజ్ ను నియమించింది గవర్నరే అని చెప్పారు.

న్యాయవాదులకు బదులుగా పొరపాటున జడ్జిలకు నిమ్మగడ్డ కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని తాను పొరపాటున అన్నానని అంగీకరించానని, అయినప్పటికీ ఆ విషయంపై కూడా ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.  

నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని టీడీపీ భావించడం హాస్యాస్పదమని, ప్రజాబలంతో రాబోయే ఎన్నికల్లోనూ తమదే విజయమని శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఓడిపోయిందని తనలాంటి వారు భావిస్తున్నారన్న విషయాన్ని తాను చెప్పానని అన్నారు.

నిమ్మగడ్డ విధుల్లో చేరితే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టేనని ,ప్రజాస్వామ్యాన్ని నిమ్మగడ్డ గౌరవించాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.